అప్పుల కెన్యా అతలాకుతలం
కెన్యాలో పన్నులు పెంచడాన్ని నిరసిస్తూ ప్రజలు పార్లమెంటుపై దాడి చేసి కొంత భాగం తగలబెట్టారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పులలో ఐదుగురు ఉద్యమకారులు మరణించగా అనేక మంది గాయపడ్డారు.
కెన్యా ప్రభుత్వం మితిమీరి అప్పులు చేయడంతో ఇప్పుడు దేశం అల్లకల్లోలం అయింది. అప్పులు తీర్చడానికి ప్రభుత్వం భారీగా పన్నులు వడ్డించాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది. పన్నులు పెరుగుతున్నాయని తెలువడంతో ప్రజలు కొద్ది రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. మొదట్లో నిరసనలు శాంతియుతంగానే సాగినయి. తీర ప్రాంత నగరమైన మొంబాస తో పాటు పలు పట్టణాలలో ప్రజలు భారీ ఎత్తున నిరసనలు తెలిపారు. నిరసనలు హఠాత్తుగా హింసాత్మకంగా మారాయి. ప్రజలు పార్లమెంటు భవనం పై దాడి చేసి కొంత భాగాన్ని తగలబెట్టారు. దీంతో సైనికుల జరిపిన కాల్పులలో ఐదుగురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు.
కెన్యాలో అప్పులు భారీగా పెరిగిపోయాయి. వడ్డీలను చెల్లించడానికే వార్షిక రెవెన్యూలో 37 శాతం ఆవిరైపోతుంది. అప్పుల భారం తీర్చుకోవడానికి 2.7 మిలియన్ డాలర్ల మేర పన్నులు వేయాలని ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది. ఇప్పటికే పన్నుల భారంతో సహనం కోల్పోయిన ప్రజలు నిరసన ప్రదర్శనలు మొదలు పెట్టారు. ఆహారపధార్థాలు, వంట నూనె తదితరాలపై పన్నులు తగ్గిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాని కొత్త పన్నులేవీ వేయకూడదని ప్రజలు భావిస్తున్నారు.
ప్రజలు హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని దేశాధ్యక్షుడు విలియం రుటో హెచ్చరించారు. దౌర్జన్యకారులు ప్రజల పైన దాడులు చేస్తూ దానిని శాంతియుత నిరసనలగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యమకారులను అడ్డుకోవడానికి ప్రభుత్వం పలు ప్రాంతాలకు సైన్యాన్ని తరలించింది.
కెన్యా లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున భారతీయులు జాగ్రత్తగా ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. స్థానిక వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చింది. కెన్యా పరిస్థితి పట్ల ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వెలిబుచ్చారు.