ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్ వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రసంగించవలసిన సభకు జనం భారీ ఎత్తున తరలివచ్చారు. జనాన్ని అదుపుచేయలేక ప్రసంగ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది. ఇండియా కూటమి తరపున ప్రచారానికి రాహుల్, అఖిలేష్ యాదవ్ ఉమ్మడిగా సభలో ప్రసంగించాలనుకున్నారు. ఫూల్ పూర్ లోక్ సభ నియోజక వర్గంలో ప్రచారం కోసం పడీలా దగ్గర ఎన్నికల సభ ఏర్పాటయింది. ఈ సభకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు. జనం ఉద్వేగంతో సభా వేదిక వైపు దూసుకు వస్తుండడంతో బారికేడ్లు కూలిపోయాయి. పోలీసులు, కార్యకర్తలు ఎంత ప్రయత్నించానా జనాన్ని అదుపు చేయడం కష్టం అయింది. వేదికపైనున్న నాయకుల భద్రతకు భంగం కలుగుతుందనే ఆందోళన తలెత్తింది. ముందు్కు చొచ్చుకు వచ్చిన కార్యకర్తలు కొందరు వేదిక పైకి ఎగబాకారు. సంయమనంతో ఉండవలసిందిగా సభికులకు ఇరువురు నాయకులు పదే పదే విజ్ఞప్తి చేసినా సందోహం సద్దుమనగలేదు. దీంతో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ ప్రసంగాల కార్యక్రమం రద్దు అయింది. వీరు ప్రసంగించకుండనే హెలికాప్టర్ పై వెళ్లిపోవలసి వచ్చింది.