Wednesday, January 1, 2025
HomeNationalతుది దశ పోలింగ్ కోసం సమాయత్తం

తుది దశ పోలింగ్ కోసం సమాయత్తం

సుదీర్ఘంగా సాగిన భారత లోక్సభ ఎన్నికలు ముగింపు రాబోతున్నాయి. చివరి దశ అయిన ఏడవ దశ పోలింగ్ జూన్ ఒకటవ తేదీన జరుగుతుంది. జూన్ నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. గత పదేండ్లుగా సాగుతున్న మోదీ పాలనపై ప్రజలు ఏ తీర్పు ఇస్తారో అనే ఆసక్తి వ్యక్తమవుతున్నది.
ఏడవ దశ పోలింగ్లో ఎనిమిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 57 స్థానాలలో ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు.
వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీ బరిలో ఉన్నారు. ఆయనపై కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి స్థానం నుంచి ప్రముఖ సినీనటి కంగనా రణౌత్ పోటీ చేస్తున్నారు. ఆమెతో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ తలపడుతున్నారు. ఈయన మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు. ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా పేరుపడింది. బిహార్లోని పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి, సోషలిస్టు రాజకీయ దిగ్గజం లాలూ ప్రసాద్ పెద్ద కుమార్తె మీసా భారతి పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి బీజేపీ తరఫున రామ్ కృపాల్ యాదవ్ పోటీలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీ చేస్తున్నారు. ఇక్కడ సిపీఎం తరఫున ప్రతికూర్ రహ్మాన్, బీజేపీ అభ్యర్థిగా అభిజిత్ దాస్ పోటీలో ఉన్నారు.
బిహార్లో మొత్తం నలభై స్థానాలుండగా చివరగా ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. హిమాచల్ ప్రదేశ్లో మొత్తం నాలుగు స్థానాలుంటే, అన్నింటికీ చివరిదశలోనే పోలింగ్ ఉన్నది. జార్ఞండ్లో మొత్తం 14 స్థానాలలో చివరి మూడింటిలో పోలింగ్ జరుగుతుంది. ఒడిశాలోని మొత్తం 21 స్థానాలలో చివరి దశలో ఆరు సీట్లలో పోలింగ్ మిగిలింది. పంజాబ్ లో మొత్తం 13 స్థానాలుంటే అన్నింటిలోనూ జూన్ ఒకటిన పోలింగ్ జరుగుతుంది. ఉత్తర ప్రదేశ్లో 80 స్థానాలుంటే అందులో 13 సీట్లు చివరి దశ పోలింగ్లో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లోని 42 స్థానాలలో చివరి దశలో తొమ్మిది సీట్లు మిగిలాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్లోని ఏకైక స్థానానికి జూన్ ఒకటిన పోలింగ్ ఉన్నది.

పంజాబ్లో …

చివరి దశలో పోలింగ్లో పంజాబ్లోని మొత్తం 13 స్థానాలలో ఓటర్లు తమ నాయకులను ఎంచుకోనున్నారు. ఈ రాష్ట్రంలో ఆప్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉన్నది. ఈ రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ, ఇక్కడ మాత్రం పోటీ పడుతున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా మొత్తం ఇండియా కూటమి ఖాతాలో చేరేవే.
ఇటీవలి వరకు పంజాబ్లోని శిరోమణి అకాలీదళ్ తో బీజేపీకి పొత్తు ఉండేది. కానీ అకాలీదళ్ బీజేపీతో తెగతెంపులు చేసుకున్నది. రైతుల సమస్యలను పరిష్కరించక పోగా, ఉద్యమాన్ని కఠినంగా అణిచి వేయడంతో పంజాబ్ ప్రజలు బీజేపీ పట్ల ఆగ్రహంగా ఉన్నారనే భావనతో అకాలీదళ్ కూడా బీజేపీకి దూరమైంది. దేశమంతటా ప్రాంతీయ పార్టీలతో దోస్తీ చేసి, వాటిని బలహీన పరిచి, తొక్కి వేసిన బీజేపీకి పంజాబ్లో మాత్రం ముందడుగు పడలేదు. బీజేపీ అకాలీ దళ్ మధ్య దాదాపు 15 ఏండ్లుగా ఉన్న పొత్తు ఇప్పుడు ఇచ్చుక పోవడంతో , బీజేపీ ఒంటరిగా మిగిలిపోయింది. పంజాబ్ అస్మిత పేరు మీద ఓట్లు తెచ్చుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నా, అది ఫలితం ఇవ్వక పోవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. దేశమంతా పలు రాష్ట్రాలలో ప్రాంతీయ శక్తులను అణచివేసిన చరిత్ర బీజేపీని వెంటాడుతున్నది.

RELATED ARTICLES

తాజా వార్తలు