దక్షిణాఫ్రికాలో సంకీర్ణానికి తొలి అడుగు
(జొహెనెస్ బర్గ్ నుంచి గుర్రాల నాగరాజు)
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు గా సిరిల్ రామఫోస మళ్ళీ ఎన్నికయ్యారు. ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ కు శుక్రవారం నేషనల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. రోజంతా ఉత్కంఠదాయకంగా చర్చలు, నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఎఎన్సీ), డెమొక్రాటిక్ అలయన్స్(డిఎ) కు పొత్తు కుదిరింది. ఆ తర్వాత కొన్ని చిన్న పార్టీలు కూడా ఈ కూటమిలో చేరాయి. దీంతో కొద్ది రోజులుగా సాగుతున్న అనిశ్చితి కి తెరబడింది. దేశ విదేశీ వ్యాపారా వర్గాలు కోరుకున్నట్టుగా ఆప్రికన్ నేషనల్ కాంగ్రెస్ తెల్ల జాతి పార్టీ అయిన డిఎ తో పొత్తు పెట్టుకోవడం విశేషం. ఎఎన్సీ కి 40 శాతం, డిఎ కు 22 శాతం ఓట్లు వచ్చాయి. దేశాద్యక్షుడిగా, ఎఎన్సీ నాయకుడిగా ఉన్న జాకబ్ జుమా ను 2018 లో కూలదోసి రామఫోస అధికారం చేపట్టారు. జాకబ్ జుమా వేరే పార్టీ పెట్టుకోవడంతో, 1994లో తెల్ల జాతి పాలన తొలగి ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభమైననాటి నుంచి అధికారంలో ఉన్న ఎఎన్సీ ఈ సారి మెజారిటి కోల్పోయింది. ఈ అధికార కూటమి ఆర్థిక వ్యవస్థ మీద ఉత్పత్తి శక్తుల మీద తెల్ల జాతీయులకు ఉన్న గుత్తాధిపత్యాన్ని మరింత స్థిర పరుస్తుందని వామపక్ష ఎకనమిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ (EFF) నాయకుడు జులియస్ మలేమా విమర్శించారు.
తెల్లజాతి ప్రాబల్యం కలిగిన, వ్యాపార వర్గాలకు అనుకూలమైన DA తో పొత్తు పెట్టుకోవడాన్ని ANC లోని వామపక్ష వర్గీయులు వ్యతిరేకించారు. కాని ఎఎన్సీ నాయకులు సిరిల్ రామఫోస డిఎ తో పొత్తు పెట్టుకోవాలన్న తన వాదనను నెగ్గించుకున్నారు. తెల్ల జాతి పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఎఎన్సీ సాయుధ విభాగం పునాదిగా మాజీ అధ్యక్షుడు జాకబ్ జూమా MK పేరుతో రాజకీయ పార్టీ ని ఏర్పరచారు. ఈ పార్టీ ఏర్పడిన ఆరు నెలలలోనే 14.6 శాతం ఓట్లతో మూడవ పెద్ద పార్టీ గా అవతరించింది. దీని మూలంగానే ANC మెజారిటి కోల్పోయింది. MK తో పాటు వామపక్షమైన EFF కూడా ANC-DA సంకీర్ణాన్ని వ్యతిరేకిస్తున్నాయి.