పార్లమెంట్ లో
ప్రజాస్వామ్య పరిమళం
చాలాకాలం తర్వాత లోక్ సభ ప్రజాస్వామ్యపరిమళం తో శోభిల్లుతున్నది. అధికార పక్షానికి ధీటుగా బలమైన ప్రతిపక్షం అవతరించింది. అనేక భాషలు, సంస్కృతులతో కూడిన భారతీయ సమాజం లోక్ సభ లోనూ ఈ భిన్నత్వాన్ని ప్రదర్శించింది. భిన్న భాషల జాతుల వారు పార్లమెంటులో ప్రదర్శించి తమ అస్థిత్వాన్ని చాటుకున్నారు. బిజెపి మెజారిటీ తెచ్చుకోలేక చతికిలపడి ప్రాంతీయ పక్షాల భుజాలపై చేతులు వేసి నిలబడాల్సివచ్చింది. తూర్పున బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు 29 మంది మరో వైపున దక్షిణాన డిఎమ్కె నుంచి 22 మంది లోక్ సభలో ప్రవేశించారు.
మహారాష్ట్ర లో శివసేన (ఉద్ధవ్) 9 స్థానాలు, ఎన్సీపీ (శరద్) 8 స్థానాలను ఈ పార్టీలు కాంగ్రెస్ తో చేతులు కలిపి బిజెపిని మట్టికరిపించాయి. ఉత్తర్ ప్రదేశ్ లో సామాజిక న్యాయాన్ని కోరే సమాజ్ వాదీ పార్టీ 37 స్థానాలు గెలుచుకుని బిజెపి, కాంగ్రెస్ తర్వాత మూడవ స్థానంలో నిలిచింది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పెద్ద పార్టీ అయినప్పటికి ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్, బిజెపి లను మినహాయిస్తే పార్లమెంటు నిండా ప్రాంతీయ పార్టీలు భారీ సంఖ్యలో లోక్ సభలో తమను విస్మరించలేని పరిస్థితిని సృష్టించుకున్నాయి. దీనిని ప్రజాస్వామ్య విజయానికి సంకేతంగా చెప్పవచ్చు.