Sunday, December 29, 2024
HomeInternationalపాలస్తీనాకు మూడు యూరప్ దేశాల గుర్తింపు

పాలస్తీనాకు మూడు యూరప్ దేశాల గుర్తింపు

పాలస్తీనాకు మూడు యూరప్ దేశాల గుర్తింపు

పాలస్తీనా ప్రాంతాన్ని దేశంగా గుర్తిస్తున్నట్టు ఐర్లాండ్, స్పెయిన్, నార్వే దేశాలు ప్రకటించాయి. కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ సైన్యాలు పాలస్తీనా ప్రాంతమైన గాజాపై దాడులు సాగిస్తున్నాయి. ఈ దాడుల మూలంగా అనేక మంది సాధారణ పౌరులు మరణిస్తున్నారు. దాడులు నిలిపివేయాలంటూ మిత్ర దేశమైన అమెరికా సహా పలు యూరప్ దేశాలు కోరుతున్నాయి. అయినా ఇజ్రాయెల్ దాడులు విరమించడం లేదు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచడానికి వీలుగా ఈ మూడు యూరపియన్ దేశాలు పాలస్తీనాను దేశంగా గుర్తించాయి. ఈ చర్యపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి , ఈ దేశాల నుంచి తమ రాయబారులను ఉపసంహరించుకున్నది.
ఇజ్రాయెల్కు తూర్పున వెస్ట్ బ్యాంక్ ఉన్నది. ప‌శ్చిమాన‌ గాజా ప్రాంతం ఉన్నది. ఈ రెండు ప్రాంతాలను కలిపి పాలస్తీనా దేశంగా గుర్తించాలనే అభిప్రాయం ఎంతో కాలంగా ఉన్నది. ఒకవైపు ఇజ్రాయిల్, మరోపక్క పాలస్తీనా రెండు దేశాలుగా ఉండాలని, శాంతియుతంగా మనగలగాలని పలు దేశాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటి వరకు 144 దేశాలు పాలస్తీనాను గుర్తించాయి. భారత్, రష్యా కూడా గుర్తించాయి. అమెరికా, కెనడా, కొన్ని పశ్చిమ యూరప్ దేశాలు తప్ప మిగతా దాదాపు అన్ని దేశాలు పాలస్తీనాను గుర్తించాయి. అయితే ఐక్య రాజ్య సమితిలో పాలస్తీనాకు పరిశీలక హోదా మాత్రమే ఉన్నది. పూర్తి స్థాయిలో దేశంగా గుర్తింపు లేదు.

కమిటీకి నివేదన

తమ దేశాన్ని గుర్తించి సభ్య దేశంగా చేర్చుకోవాలని పాలస్తీనా అథారిటీ (పి.ఎ.) ఐక్య రాజ్య సమితి భద్రతా మండలికి దరఖాస్తు చేసుకున్నది. దీనిని భద్రతా మండలి సంబంధిత కమిటీకి పంపించింది. ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం ఏదైనా దేశానికి సభ్యత్వం ఇవ్వాలంటే, మొదట భద్రతా మండలి ఆమోదించాలి. శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ప్రాన్స్ దేశాలలో ఏ ఒక్కటికి కూడా వీటో చేయ కూడదు. ఆ తరువాత సర్వ ప్రతినిధి సభ ఆమోదించాలి. సర్వ ప్రతినిధి దేశాలలో మూడవ ప్రపంచ దేశాలన్నీ పాలస్తీనాను ఇప్పటికే గుర్తించాయి. ఐక్య రాజ్య సమితి సభ్యత్వాన్ని ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇజ్రాయిల్ ను పైకి మెతకగా విమర్శిస్తూ, ఆచరణలో పూర్తి మద్దతు ఇస్తున్న అమెరికా పాలస్తీనా సభ్యత్వానికి ఆమోదించేలా లేదు.
ఇజ్రాయిల్తో చర్చలు ద్వారా ఆమోదం పొందాలని మెలిక పెడుతున్నది.
పాలస్తీనా సమస్య నిరంతరం రగులుతూ ఉన్నందున పాలస్తీనా దేశం ఏర్పాటే పరిష్కారమని యూరప్ దేశాలు ప్రస్తుతం అభిప్రాయ పడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు మాత్రం ఇందుకు ఆమోదించేలా కనిపించడం లేదు.

RELATED ARTICLES

తాజా వార్తలు