(జనపదం ప్రత్యేక ప్రతినిధి)
జూన్ 4 వ తేధీ
ఓట్ల లెక్కింపు సాగుతున్నది.
ఇండియా కూటమి ని అందులోనూ కాంగ్రెస్ పార్టీ అనూహ్య రీతిలో సీట్లు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నివాసానికి చేరుకున్నారు.రాజకీయ వర్గాలను ఆశ్చర్యచకితులను చేసిన సన్నివేశమిది.
కాంగ్రెస్ పార్టీలో, జాతీయ రాజకీయాలలో ప్రియాంక శకం ఆరంభమవుతుందా అనే ఆసక్తిదాయక ఊహాగానాలకు అవకాశం ఏర్పడింది.
ఇంతకాలం తెర వెనుక కీలక పాత్ర పోషించిన ప్రియాంక గాంధీ కేరళ లోని వయనాడు నుంచి లోక్ సభ లోకి అడుగు పెడుతున్నారు. రాజకీయాలలో భవిష్యత్తును అంచనా వేయడం సాహసమే అయినప్పటికీ వయానాడు ఉప ఎన్నికలో ప్రియాంక గెలుపు ఖాయమనే చెప్పవచ్చు. ప్రియాంకకు ఈ అవకాశం అబ్బనంగా దక్కింది కాదు. ఒక్కొక్క మెట్టు శ్రమకోర్చి ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నారామె. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబ ప్రాధాన్యం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాజీవ్ హఠాత్ మరణానంతరం మునిగిపోతున్న కాంగ్రెస్ నౌకను గట్టెంకిచిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుంది. అయినప్పటికీ నెహ్రూ కుటుంబం కాంగ్రెస్ ను నడిపించే అసలైన వారుసులెవరనే ప్రశ్న మిగిలే ఉంది. సోనియా అందించిన అవకాశాన్ని రాహుల్ ఉపయోగించుకోలేక పోయారని కనిపిస్తూనే ఉన్నది. రాహుల్ స్థానంలో ప్రియాంక బాధ్యతలు చేపట్టాలని కార్యకర్తలు బహిరంగంగా కోరిన ఉదంతాలున్నాయి. పార్టీ వర్గాల నమ్మకాన్ని కోల్పోయిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుండి తప్పుకోవడమే కాకుండా తమ కుటుంబం నుంచి మరెవరూ అధ్యక్ష బాధ్యత చేపట్టకూడదన్నారు. ఈ విధంగా ప్రియాంక ఎదుగుదలను అడ్డుకున్నట్టయింది. పార్టీ అధ్యక్ష పదవి వదులుకున్న రాహుల్ బ్యాక్ సీట్ డ్రైవింగ్ మొదలు పెట్టాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ మరింత పతనమయింది. చివరకు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబ నాయకత్వం పైనే విశ్వాసం సడలిపోవడం మొదలైంది.
ఈ విషమ పరిస్థితుల్లో సోనియా గాంధీ ఎన్నికలను ఎదుర్కోవడం కోసం ప్రియాంక ను ముందుకు తెచ్చారు. తనకు అప్పగించిన బాధ్యతలను ప్రియాంక విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కాని ఎక్కడా తాను రాహుల్ ప్రత్యామ్నాయమనే భావన కలగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇటీవల లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లకు (మహారాష్ట్రలో ఇండిపెండెంట్ గా గెలిచిన పార్టీ అభ్యర్థితో కలిపి) చేరుకున్నది అంటే అందుకు ప్రియాంక చతురతే కారణం. యూపీలో సమాజ్ వాదీ పార్టీ తో పొత్తు కుదుర్చుకుని కాంగ్రెస్ పార్టీ బీజేపీ ని దెబ్బకొట్టగలిగింది అంటే అందుకు ప్రియాంక నిర్వహించిన పాత్రే కారణం.
హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడానికి ఆమె వ్యూహాలే కారణం. హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, పంజాబ్ రాష్ట్రాలలో తలెత్తిన సంక్షోబాలు ఆమె చాకచక్యంగా పరిష్కరించారు. రాజస్థాన్ లో గెహ్లాట్, సచిన్ పైలెట్ మద్య ఏర్పడిన విభేధాలను పరిష్కరించారు. ఈ విధంగా పార్టీ ఐక్యతను కాపాడగలిగారు. వాస్తవానికి రాజస్థాన్ లో సంక్షోభానికి రాహుల్ గాంధీ వ్యవహార సరళియే కారణం అనే అభిప్రాయం ఉంది. ప్రియాంక ఎన్నడూ పార్టీ నాయకులను చులకన చేయరని వారి పట్ల చాలా మర్యాదగా నడుచుకుంటారని పార్టీ నాయకులు చెబుతుంటారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం లేకుండా అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్న సమయంలో వివిధ రాష్ట్రాలలోని పార్టీ వర్గాలు చెదిరి పోకుండా, ధిక్కారానికి పాల్పడకుండా కలిసి కట్టుగా నడిపించడంలో ప్రియాంక సఫలమయ్యారు.
ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ, అమేథీ లలో కాంగ్రస్ విజయానికి ప్రియాంక సాగించిన విస్తృత ప్రచారమే కారణం. వయనాడులో రాహుల్ గాంధీ పోటీ చేసినప్పటికీ ప్రియాంక అక్కడి ప్రచారంలో పాల్గొని ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.
కేవలం 2 సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే ప్రియాంక కాంగ్రెస్ జాతకాన్ని తిరగరాసింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ప్రియాంక పట్ల అభిమానాన్ని కనబరుస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రధాన మోదీ విమర్శలకు ఘాటుగా మాటల తూటాలు పేల్చి పార్టీ వర్గాలకు ఆమె నూతనోత్తేజాన్ని కలిగించారు. ఈ నేపథ్యంలో వయనాడు నుంచి లోక్ సభలో అడుగుపెడితే ప్రియాంక రాజకీయ చతురత మరింత ప్రస్ఫుటమవుతుంది. ప్రతిపక్ష నేతగా ఆమె స్థిరపడినా ఆశ్చర్యం లేదు.