బిజెపి కి హర్యాన సంకటం
లోక్ సభ ఎన్నికల్లో ఎదురుగాలికి ఖంగుతిన్న బిజెపిని హర్యాన సంకటం కలవరపెడుతుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి హర్యాన లోని మొత్తం 10 సీట్లను గెలుచుకున్నది. కాని ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో 5 మాత్రమే దక్కాయి. మిగితా 5 సీట్లను కాంగ్రెస్ చేజిక్కించుకుంది. లోక్ సభ ఎన్నికల్లోనే మోదీ ప్రభావం అంతగా కనిపించకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి ఏమిటని హర్యానలోని బిజెపి శ్రేణుల్లో కలవరం మొదలైంది. కాంగ్రెస్ వర్గాలలో మాత్రం ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నది.
ఈ ఏడాది నవంబర్ 3 తో హర్యానా శాసనసభ గడువు ముగుస్తుంది. దీంతో అక్టోబర్ లోగా ఎన్నికలు జరగవలసి ఉంది. హర్యానా అసెంబ్లీ లో మొత్తం 90 స్థానాలున్నాయి. అధికారం చేపట్టడానికి కనీసం 46 సీట్లు అవసరం. గత ఎన్నికల్లో బిజెపి కి 40 స్థానాలు, కాంగ్రెస్ కు 31, జన నాయక్ జనతా పార్టీ(జెజెపి) కి 10 స్థానాలు లభించాయి. జెజెపి తో కలిసి బిజెపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆరుగురు ఇండిపెండెంట్ల మద్దతు కూడా తెచ్చుకోగలిగింది. మిగతావి ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. లోక్ సభ ఎన్నికలకు ముందు జెజెపి సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగింది. ఇండిపెండెంట్లు ముగ్గురు మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో బిజెపి ప్రభుత్వం సంక్షోభంలో పడింది.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేశాయి. ఆప్ తనకు కేటాయించిన ఒక్క స్థానంలో పోటీ చేసి ఓడిపోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరి గా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నది. రాష్ట్రంలోని 90 స్థానాలలో తాము బలంగా ఉన్నామని ఏ పార్టీ తో పొత్తు అవసరం లేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. హర్యాన లో బిజెపి ప్రభుత్వం మెజారిటి కోల్పోయినందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండు చేస్తుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హర్యాన ఇండియా కూటమికి అత్యంత ఎక్కువగా 47.6 శాతం వచ్చాయని కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా తెలిపారు. కాంగ్రెస్ కూటమి ఓట్లు 20 శాతం పెరిగితే బిజెపి ఓట్లు 12 శాతం తగ్గాయని వెల్లడించారు.