మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అక్టోబర్లో జరగనున్నాయి. ఎన్నికలలో నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉండడంతో మహారాష్ట్ర రాజకీయ వర్గాలలో హడావుడి మొదలైంది. ఎన్సీపి, శివసేన పార్టీల నుంచి చీలిపోయి బిజెపి తో చేరిన చీలిక వర్గాల ఎమ్మెల్యేలకు గుబులు మొదలైంది. లోక్ సభ ఎన్నికలలోనే మోదీ ప్రభావం క్షీణించి బిజెపి వ్యతిరేక గాలి వీచింది. కనుక ఇక అసెంబ్లీ ఎన్నికలపై ఆశ పెట్టుకోలేమని బిజెపి కూటమిలోని నాయకులు భావిస్తున్నారు. షిండే నాయకత్వంలో చీలిపోయిన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మళ్లీ ఉద్దవ్ ఠాక్రే వైపు వెళ్ళడమే మేలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే విధంగా అజిత్ పవార్ వెంట వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ శరద్ పవార్ చెంతకు చేరదామని సంకేతాలు పంపుతున్నారు.
లోక్ సభ ఎన్నికలకు ముందు బిజెపి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసింది. మోదీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దాదాపు 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసింది. మహారాష్ట్ర లోని శివసేనను, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపి) ని చీలగొట్టి ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని బిజెపి కూలదోసింది. ఏక్ నాధ్ షిండే నాయకత్వంలోని శివసేన, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపి చీలిక వర్గాలను కూడగట్టి బిజెపి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాని ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపి కి, ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనకే మహారాష్ట్ర ప్రజలు మద్దతు పలికారు.
శివసేన (ఉద్దవ్), ఎన్సీపి(శరద్ పవార్), కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహారాష్ట్ర వికాస్ అఘాదీ (MVA) కూటమి బిజెపి కూటమిని మట్టికరిపించింది.
2019 లోక్ సభ ఎన్నికలలో బిజెపి కి 23 సీట్లు రాగా ఈ సారి 9 మాత్రమే లభించాయి. మహారాష్ట్రలోని మొత్తం 48 సీట్లలో బిజెపి కూటమికి 17 మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ కూటమికి 30 సీట్లు వచ్చాయి.
అజిత్ పవార్ వర్గానికి చెందిన దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి సంసిద్దంగా ఉన్నారని ఎన్సీపి(శరద్ పవార్) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జయంత్ పాటిల్ వెల్లడించారు. ఆ వెంటెనే తాము వెళ్లిపోయిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే వెల్లడించారు.