కాంగ్రెస్ పార్టీ రైతులను మరోసారి మోసం చేసిందని బి ఆర్ ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, నిరుద్యోగ యువకులను మోసం చేస్తున్నదని ఎండగట్టారు. అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని మోసం చేసిందన్నారు. గతంలో రైతు భరోసా క్రింద రూ.15000 ఇస్తామని చెప్పారని కానీ తొలి విడత రూ. 7500 కాకుండా రూ.5000 మాత్రమే ఇస్తున్నారని గుర్తుచేశారు.
మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపణల్లోని ప్రధానాంశాలు –
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పడం ఆ పార్టీ మోసానికి పరాకాష్ట.
తెలంగాణలో యాసంగిలో పండేదే దొడ్డు వడ్లు. పండని సన్నవడ్లకు బోనస్ ఇస్తామనడం మోసం కాదా, రైతులు నోట్లలో మట్టికొట్టడం కాదా?
వానకాలంలో 20 శాతం సన్నాలు, యాసంగిలో 99 శాతం దొడ్డువడ్లు పండుతాయి.
నిరుద్యోగులకు 4 వేల భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, తర్వాత ఆ హామీ ఇవ్వలేదని అసెంబ్లీలో చెప్పారు. వడ్ల విషయంలోనూ మాట తప్పుతున్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో సన్నవడ్లకు అని ఎక్కడా చెప్పకుండా వరిధాన్యానికి చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం పండని వడ్లకు ఇస్తామంటున్నారు.
రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండించడం వల్లే మనం ఇంత తండి తింటున్నాం.
రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ అందరూ వరిధాన్యానికి బోనస్ అనే చెప్పారు.
కోటి 20 లక్షల వరి ధాన్యానికి 500 బోస్ ఇవ్వాలంటే 6 వేల కోట్లు కావాలి. సన్నాలకు మాత్రమే ఇస్తే 500 కోట్లు సరిపోతాయి.4500 కోట్లు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారు.
రైతుభరోసా కింద 15 వేలు ఇస్తామని చెప్పి పాక్షికంగానే ఇస్తున్నారు. గతంలో మాదిరే తొలి విడత కింద 7500 కాకుండా 5 వేలే ఇస్తున్నారు.
కాంగ్రెస్ హామీ ప్రకారం రైతుభరోసా కింద 15 వేలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.
బకాయి పడిన 2500, వానకాలం పంటల విడత కింద 7500 కలిపి జూన్ లోపల 10 వేలు ఇవ్వాలి.
సన్నవడ్లకే మాత్రమే బోనస్ ఇస్తారా? దొడ్డు వడ్లకు ఇవ్వరా? దొడ్డువడ్లకు ఇస్తే ఎప్పటి నుంచి కొంటారో చెప్పాలి.
మీ ఎన్నికల హామీ ప్రకారం జొన్న, మిరప, పసుపు, సోయాబీన్, ఎర్రజొన్న ఇతర పంటలకు కూడా మద్దతు ధర ఇవ్వాలి? వాటికి ఇస్తారా ఇవ్వరా?
వడ్ల బోనస్ విషయంలో ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇచ్చేలా రైతాంగాన్నిఏకం చేసి పోరాడతాం.
వానాకాలం నుంచి పంటలకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.
భట్టి మాటలు వట్టి మాటలు. సన్నవడ్లకే బోనస్ ఇస్తామని చెప్పిన మాటను ఓట్లు డబ్బాలో పడకముందు ఎందుకు చెప్పలేదు? డబ్బాలో ఓట్లు పడి సీల్ అయిన తెల్లారి చెప్పి దగా చేశారు.
మా పదేళ్ల పాలనలొ 7 కోట్ల 28 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించాం.
గత ఏడాది 66 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 36 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నది. మిగిలిన వారం, పదిరోజుల్లో సీన్ అయిపోతుంది.
ఆలోపు 30 లక్షల మెట్రిక్ టన్నులు కొనే పరిస్థితిలేదు. దీంతో రైతులు తక్కువ ధరకే దళారులకు అమ్ముకుంటున్నారు. మిల్లర్ల నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కొని హాస్టళ్లకు అందించాం.
ప్రభుత్వ కొనుగోలు విధానం సరిగా లేదు. వడ్ల కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
4, 5 కేజీలు తరుగు పెడుతున్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. వాళ్లను అనరాని మాటలు అంటున్నారు.
తడిచిన వడ్లు సహా అన్ని రకాల వడ్లు కొంటామని ప్రభుత్వం చెబుతోంది.
కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ధాన్యం కొనడం లేదని రైతులు నాకు ఫోన్ చేస్తున్నారు. (మెదక్ ముద్దులవైయి నుండి బెజ్జంకి కేంద్రానికి లోడ్ తో వెళ్లిన లారీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి (9573604789) తో హరీశ్ గారు ఫోన్లో మాట్లాడారు. తడిచిన ధాన్యాన్ని మూడు రోజులైనా కొనడం లేదని డ్రైవర్ చెప్పారు)
అన్ని రకాల వడ్లను చివరి గింజవరకు కొంటామని డైలాగులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో చేసింది మాత్రం శూన్యం.
భూసారం పెంచే జీలుగు, జనుము వంటి పచ్చిరొట్ట విత్తనాలను కూడా ప్రభుత్వం సరఫరా చేయలోకపోతోంది.
రైతులు ఎరువుల కోసం పెట్టినట్లు విత్తానా కోసం కవర్లు లైన్లో పెడుతున్నారు. ఇదీ రాష్ట్ర రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి.
వడ్ల బోనస్‌పై కేబినెట్ నిర్ణయాన్ని ప్రభుత్వం పునస్ససమీక్షించుకోవాలి.
అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి. ఏ పంటలకు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారో ఆ పంటలకు వానకాలం నుంచి ఇవ్వాలి.
రైతుబంధుకు కోతలు పెట్టకుండా తక్షణమే 7500 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
వడగళ్ల వాన, అకాల వర్షాల్లో నష్టపోయిన పంటలకు ఎకరానికి 25వేల పరిహారం ఇవ్వాలి.
వానలు పడుతున్నాయి కాబట్టి తడిచిన ధాన్యాన్ని యుద్దప్రాతిపదికన కొనాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.