Sunday, December 29, 2024
HomeNationalసంఘ పరివార్ ఇంటర్నల్ వార్

సంఘ పరివార్ ఇంటర్నల్ వార్

సంఘ పరివార్ ఇంటర్నల్ వార్

లోక్ స‌భ‌ ఎన్నికలు ముగిసిన తరువాత కూడా బీజేపీపై ఆర్ఎస్ఎస్ గుర్రుగా ఉన్నదనే విషయం మరింత ధృవపడిందే తప్ప, అనుమానాలు తొలగిపోలేదు. ఆర్ఎస్ఎస్ నాయకుల నుంచి బీజేపీకి మొట్టికాయ లు పడుతూనే ఉన్నాయి.

బీజేపీ నాయకత్వం పట్ల ఆర్ఎస్ఎస్ అసంతృప్తిగా ఉందనే వార్తలు దేశమంతా వ్యాపించాయి. మోదీ పధాని పదవిచేపట్టిన తరువాత, బలమైన నాయకులను పక్కకు తప్పించారు. అద్వానీ వంటి నాయకుడు కూడా అవమానకరమైన రీతిలో తెరమరుగయ్యారు. ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషీ, అరుణ్ జైట్లీ, సుశ్మా స్వ‌రాజ్ ల‌ను కూడా మోదీ ప‌క్క‌కు త‌ప్పించారు. 75 ఏళ్ళ వ‌య‌సు దాటినవారు ప‌ద‌వుల్లో ఉండ‌కూడ‌ద‌ని కూడా ఆయ‌న ఒక నియ‌మం పెట్టారు. చివరకు మోదీ- అమిత్ షా గుప్పెటలోకి బీజేపీ పూర్తిగా వెళ్ళిపోయింది. బీజేపీ సిద్ధాంతాలు అంటూ ఏమి మిగలక పోగా, మోదీని చూసి ఓటు వేయాల్సిందే అనే పరిస్థితి వచ్చింది. మోదీ విధానాలు సాధారణ విద్యావంతులకే కాదు, మొదటి నుంచి ఆర్ ఎస్ ఎస్ లో ఉన్న వారికి కూడా మింగుడు పడటం లేదు. దీంతో ఎన్నికల ముందే మోదీకి ఆర్ఎస్ఎస్ మద్దతు పెద్దగా ఉండదనే అభిప్రాయం ఏర్పడింది.

ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఈ రెండింటి మధ్య అగాధం కొనసాగుతుందనే ఎవరూ ఊహించ లేదు. అడపాద‌డపా మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి వెలువడుతూనే ఉన్నాయి. ఆర్ ఎస్ఎస్ వంటి కఠోర క్రమశిక్షణ గల సంస్థలో, మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు యధాలాపంగా వెలువడే అవ కాశం లేదు. ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో ఉండే మనోభావాలే పై వారిలో అయినా, కింది వారిలో అయినా వ్యక్తమవుతూ ఉంటాయి.

నిజమైన సేవక్లో అహంకారం ఉండదని ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్య‌ సూటిగా మోదీని ఉద్దేశించిందే అనవచ్చు. భగవత్ స్థాయి వ్యక్తి మామూలు నాయకుల గురించి ఈ విధంగా మాట్లాడరు. ఎన్నికలు నిర్వహించిన తీరును కూడా ఆయన తప్పు పట్టారంటే ఇది నాయకత్వ ౦పై చేసిన విమర్శనే. రాముడిని పూజించిన వారు అహంకారిగా మారడం వల్ల 241 దగ్గరే ఆగిపోయారంటూ మరో ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యతో తమకు సంబంధం లేదని ఆర్ఎస్ఎస్ నాయకులు చెప్పినప్పటికీ, ఈ వ్యాఖ్య యధాలాపంగా వెలువడిందని నమ్మలేమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఆర్ఎస్ఎస్ కు చెందిన ఆర్గనైజర్ పత్రికలో ఒక ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు బీజేపీ చేసిన పొరపాట్లను ఎత్తి చూపడం గమనార్హం. మహారాష్ట్రలో బీజేపీ అజిత్ పవార్ను చేర్చుకోవడాన్ని ఈ వ్యాసంలో తప్పు పట్టా రు. బీజేపీ పార్టీగా బలపడింది, ఇక ఆర్ఎస్ఎస్ అవసరం లేదంటూ ఆ పార్టీ నాయకుడు ఒకరు చేసిన వ్యాఖ్య కూడా సంచలనం సృష్టించింది. బీజేపీ అగ్ర నాయకత్వం కనుసైగ చేయనిదే ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేసే ధైర్యం సాధారణ నాయకులకు ఉంటుందా అనే ప్రశ్న తలెత్తుతున్నది.

ఈ వివాదం తీవ్రరూపం దాల్చుతుందా లేదా అనేది వేరే విషయం. సంఘ్ పరివార్లో అంతా సవ్యంగా లేదని, మోదీ పట్ల ప్రజలలో అసంతృప్తి పెరిగినట్టే, ఆర్ఎస్ఎస్ లో కూడా వ్యతిరేకత నెలకొన్నదనే అభి ప్రాయానికి ఇటీవలి పరిణామాల వల్ల బలం చేకూరుతున్నది.
ఈసారి లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో పార్టీ కార్య‌క‌ర్త‌లు ఉత్సాహంగా పని చేయ‌లేదు. రాష్ట్ర స్థాయి నాయ‌కులు కూడా మోదీ పట్ల వ్య‌తిరేక‌త‌తో ఉన్న‌ట్లు తెలుస్తుంది. వీటికి తోడు బీజేపీ సొంతంగా మెజారిటీ ల‌భించ‌లేదు. మోదీకి ప్ర‌జ‌ల‌లో ఆద‌ర‌ణ త‌గ్గిపోయింద‌ని వెల్ల‌డైన త‌ర్వాత పార్టీలో మోదీకి పూర్వం మాదిరిగా గ‌ట్టి ప‌ట్టు ఉండ‌దు. 2025 సెప్టెంబ‌ర్ 15 నాటికి మోదీ వ‌య‌సు 75 కు చేరుకుంటుంది. అప్ప‌టి వ‌రకు ఆయ‌న‌పై సంఘ ప‌రివార్ శ‌క్తులు ఒత్తిడి పెంచే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

RELATED ARTICLES

తాజా వార్తలు