తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను ప్రస్తావించారు –
తుఫాన్ ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం మాత్రం రోజుల తరబడి వడ్లు కొనకపోవడం వల్ల వడ్లు తడిచే అవకాశం ఉంది.
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు కల్లాల్లో పడిగాపులు కావలసిన పరిస్థితి ఏర్పడింది.
తడిసిన వడ్లతో సహా అన్ని వడ్లను కొంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. చిన్నకోడూరు కేంద్రాల్లో రైతులు 20 రోజులుగా వేచి చూస్తున్నారు.
ధాన్యం ఒకటికి రెండుసార్లు తడిసి మొలకెత్తింది. ధాన్యం రైస్ మిల్లుకు వెళ్లాక తేమ శాతం ఎక్కువ ఉందని, మొలకెత్తిందని కొనడం లేదు. కొన్నా తరుగు తీసేయడం వల్ల సంచికి మూడు కిలోలు కోతపెట్టే పరిస్థితి ఏర్పడుతుంది.
తరుగు లేకుండా వెంటనే వడ్లు కొనాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.తడిచిన, మొలకెత్తిన వడ్లను కూడా కొనాలి.
40% ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. లారీల సంఖ్య పెంచి ధాన్యాన్ని కొనాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.