తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన చారిత్రక సందర్భంగా, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా (TASA) దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ వేదికగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో TASA తన దశాబ్ది ఉత్సవాల్ని ఘనంగా ప్రారంభించింది. భారత కాన్సులేట్ కార్యాలయం నుండి కాన్సులర్ ఆఫీసర్ శ్రీ సుధీర్ ఖురానా ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ చారిత్రక వారసత్వాన్ని, సమైక్యతను కొనియాడారు.
అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాస్ గారు పదేళ్లుగా TASA కి సహకరిస్తున్న సభ్యులకి, కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు. రాపోలు సీతారామరాజు నిర్వహణలో కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. పిల్లల, పెద్దల నృత్య కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో TASA సహాయ సహకారాలు అందించిన వారిని, మిగతా తెలుగు సంఘాల పెద్దలను ఘనంగా సత్కరించుకుంది. ఉపాధ్యక్షుడు బండారు మురళి వందన సమర్పణతో కార్యక్రమం పూర్తయ్యింది.