స్పీకర్ గా మళ్ళీ ఓం బిర్లా
18 వ లోక్ సభ స్పీకర్ గా బీజేపీ ప్రతిపాదిత అభ్యర్థి ఓం బిర్లా(Om Birla) బుధవారం ఎన్నికయ్యారు. డిప్యూటి స్పీకర్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వడానికి బిజేపి అంగీకరించక పోవడంతో కాంగ్రెస్ పార్టీ అత్యంత సీనియర్ సభ్యుడయిన కె. సురేష్ ను నిలబెట్టింది. దీంతో పోటీ అనివార్యమయింది. ఎన్నిక జరిగిన వెంటెనే ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆయనను అభినందించి సభాపతి స్థానం దగ్గరకి తోడ్కొని వెళ్ళారు. వచ్చే అయిదేళ్ళ పాటు మీ మార్గదర్శకత్వం కోసం చూస్తుంటామని ప్రధాని మోదీ స్పీకర్ బిర్లాను అభినందించారు. ప్రజల గొంతుకను వినిపించే అవకాశాన్ని ప్రతిపక్షానికి స్పీకర్ ఇస్తారని ఆశిస్తున్నట్లు రాహుల్ గాంధీ అన్నారు. ప్రతిపక్షం సహకరిస్తుందని ఆయన స్పీకర్ ను అభినందిస్తూ అన్నారు.
స్పీకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించాలని బిజెపీ మొదట్లో కోరింది. అయితే సంప్రదాయం ప్రకారం డిప్యూటి స్పీకర్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ షరతు పెట్టింది. బిజెపీ అందుకు అంగీకరించలేదు. లోక్ సభలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు సుదీప్ బంద్యోపాధ్యాయ్, శరద్ పవార్ వర్గం, ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే తదితరులు స్పీకర్ ఓం బిర్లాను అభినందించారు. గత లోక్ సభలో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని విమర్శిస్తూ బిల్లులను ఆమోదించే ముందు తగినంత చర్చ జరగాలని సుదీప్ బంద్యోపాధ్యాయ హితవు చెప్పారు. గత పర్యాయం పార్లమెంటులో దాదాపు 150 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని సుప్రియా సూలే తప్పు పట్టారు. వచ్చే ఐదేళ్ళలో స్పీకర్ సస్పెన్షన్ ల విషయం ఆలోచించవద్దని ఆయన అన్నారు. స్పీకర్ ప్రతిపక్షాల గొంతు నొక్కబోరని ఆశిస్తున్నట్లు సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ అభిప్రాయ పడ్డారు.