Voters | తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాలకు మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి శిక్షణా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక ఎన్నికల్లో ఓటు వేసే వారికి ఓటరు స్లిప్పుల పంపిణీ కూడా వేగంగా కొనసాగుతోంది. ఆన్‌లైన్ ద్వారా కూడా ఓటరు స్లిప్పులను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. నేటితో ప్రచారం ముగియనుంది. ఇక మిగిలింది పోలింగే కాబట్టి.. జనాలు ఓటేసేందుకు ఉత్సాహాంగా ఉన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటరు జాబితాలో పేరు ఉన్నవారందరికీ ఓటు వేసే అధికారం ఉంటుంది. అయితే ఆ ఓటరును తానే అని నిరూపించుకునేందుకు ఓటరు గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఓటరు గుర్తింపు కార్డు జారీ కానీ పక్షంలో ఈ 11 గుర్తింపు కార్డులు చూపించి ఓటు వేసే అవకాశం పొందొచ్చు.
11 గుర్తింపు కార్డులు ఇవే..
1. పాస్ పోర్టు
2. డ్రైవింగ్ లైసెన్స్
3. ప్రభుత్వ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసిన ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులు
4. బ్యాంక్ పాస్ పుస్తకం, పోస్టాఫీస్ పాస్ పుస్తకం
5. పాన్ కార్డు
6. ఎన్పీఆర్ కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు
7. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు
8. కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు
9. ఫొటోతో కూడిన పెన్షన్ పత్రం
10. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు
11. ఆధార్ కార్డు