కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) పాండువాలో ఓ బాలుడు ఆడుకుంటూ బాల్ అనుకొని నాటు బాంబును కాలితో తన్నాడు. దీంతో అది పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని దవాఖానకు తరలించగా చికిత్సపొందుతూ మరణించాడు. సోమవారం ఉదయం 8 గంటలకు పాండువా పట్టణంలో రాజ్ బిస్వాస్ (Raj Biswas) అనే బాలుడు ఆడుకుంటూ బాల్ అనుకొని ఓ నాటు బాంబును కాలితో తన్నాడు.
దీంతో అది వెంటనే భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో బాంబును తన్నిన బాలుడితో పాటు మరో ఇద్దరు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని వెంటనే సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
అయితే రాజ్ బిస్వాస్ పరిస్థితి విషమించడంతో.. మెరుగైన చికిత్స కోసం చుంచుర ఇమాంబర హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడని పోలీసులు తెలిపారు. కాగా, రాజ్ బిస్వాస్ బాలుడు బుర్ద్వాన్‌కు చెందిన వాడని, వేసవి సెలవుల్లో పాండువాలోని తన మామయ్య ఇంటికి వచ్చాడని చెప్పారు.