హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కనుసన్నల్లో ధాన్యం అమ్మకం, సన్న బియ్యం కొనుగోలులో రూ. 1,100 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. గ్లోబల్ టెండర్ల పేరిట భారీగా అక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ అంశంపై తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
పౌరసరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరుగుతోంది. ధాన్యం టెండర్లలో కాంగ్రెస్ సర్కార్ భారీ కుంభకోణానికి తెరలేపింది. సన్నబియ్యం టెండర్లలో మొత్తం రూ. 1,100 కోట్ల కుంభకోణం జరిగింది. గ్లోబల్ టెండర్ల పేరుతో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి. ధాన్యం విక్రయం కోసం జనవరి 25న కమిటీ వేసి టెండర్లు పిలిచారు. మొత్తం ప్రక్రియను ఒకేరోజు పూర్తి చేయడంలో అంతర్యం ఏంటి..? గ్లోబల్ టెండర్లు పిలిచి మొత్తం 4 సంస్థలకే కట్టబెట్టారు.
కేంద్రీయ భండార్ సంస్థను గత ప్రభుత్వం బ్లాక్ చేసింది. నిబంధనలు మార్చేసి మళ్లీ కేంద్రీయ భండార్ సంస్థకే టెండర్లు కట్టబెట్టారు. అనధికారికంగా ఎక్కువ చెల్లించాలని మిల్లర్లను బెదిరిస్తున్నారు. ధాన్యం విక్రయాన్ని క్వింటాల్‌కు రూ. 2007కే ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు క్వింటాల్‌కు రూ. 2,230 చెల్లించాలని మిల్లర్లను బెదిరిస్తున్నారు. ఒప్పందం ప్రకారం 90 రోజుల్లో గోదాముల్లోని ధాన్యం తీసుకెళ్లాలి. ఇప్పటి వరకు ధాన్యం తీసుకెళ్లని సంస్థలపై ఏ చర్యలు తీసుకోలేదు అని కేటీఆర్ తెలిపారు.
15 రోజుల కింద ఈ కుంభకోణాన్ని మా పార్టీ బయటకు తీసినా ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు. ఈ కుంభకోణం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడలేదు… మేము లేవనెత్తిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ అంటే స్కీమ్‌లు, కాంగ్రెస్ అంటే స్కామ్‌లు అని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాల కుంభమేళా అని విమర్శించారు.
ధాన్యం సేకరణపైన దృష్టి పెట్టకుండా రైతన్నల నుంచి సేకరించిన ధాన్యం పైన కన్ను వేసి ఈ స్కాంకి, అవినీతి చీకటి దందాకు తెరలేపారు. ఈ కుంభకోణంలో సీఎం కార్యాలయంతో పాటు ఢిల్లీ పెద్దల ప్రమేయం కూడా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పని చేతనైత లేదు కానీ… తమ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2.20 లక్షల టన్నుల సన్న బియ్యం కొనుగోలు పక్రియ రెండో కుంభకోణం అని కేటీఆర్ తెలిపారు.