24 నుంచి కొత్త లోక్ సభ
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కొత్త లోక్ సభ ఈ నెల 24 వ తేధీన ప్రారంభం కానుంది. జులై 3 వ తేధీ వరకు సమావేశాలు కొనసాగుతాయి. ప్రధానిగా 3వ సారి మోదీ పదవీ బాధ్యతలు చేపట్టారు. కానీ ఈ సారి బిజెపి మెజారిటి కోల్పోయి ఇతర పక్షాల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరో వైపు కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. దీంతో ఈ లోక్ సభ సమావేశాలు ప్రాధాన్యం ఏర్పడింది. 24 నుంచి లోక్ సభ సమావేశాలు ప్రారంభవుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు X (ట్విట్టర్) వేదికగా వెళ్లడించారు. మొదట కొత్తగా ఎన్నికైన ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 3 రోజులు పడుతుంది. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి జూన్ 27వ తేధీన రాష్ట్రపతి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగంలో కొత్త ప్రభుత్వ విధాన పరమైన వివరాలుంటాయి. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలిపే తీర్మానం పై చర్చ ఉంటుంది. అధికార పార్టీకి మెజారిటి ఉంటుంది కనుక ఈ తీర్మానం ఆమోదం పొందుతుంది. కాని బలమైన ప్రతిపక్షం ఉండడం వలన చర్చలు ఆసక్తికరంగా సాగవచ్చు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు సమాధానంగా ప్రధాని ప్రసంగం ఉంటుంది. జూన్ 27వ తేధీన రాజ్యసభ సమావేశాలు ప్రారంభవుతాయి. జులై 3వ తేధీన పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయి.