JanaPadham_Main_Paper_TS_15-09-2024 EPaper
పుట్టెడప్పులు..
అప్పుల పాలన
రూ.50 వేల కోట్లతో రేవంత్ సర్కార్ రికార్డు..
జూలైలో అత్యధికంగా రూ.10,392 కోట్లు..
రాష్ట్ర చరిత్రలో అత్యధిక నెలవారీ అప్పిదే..
ఈ నెలలోనే సేమ్ సీన్..
వారం రోజుల్లో రూ.4 వేల కోట్ల రుణం..
ఇంకా పెరిగే అవకాశం..
అప్పుడప్పుడు కాకుండా నిత్యం అప్పే. రాష్ట్రం నడిచేది అప్పుల ఇంధనంతో. తెల్లారితే చాలు మళ్లీ చెయ్యి చాచడమే. పని మొదలు పెట్టాలంటే పొక్క పొడవాల్సిందే. ప్రగతేమోగానీ, నెత్తిన కుంపటి మాత్రం తప్పడం లేదు ప్రజలకు. రికార్డు స్థాయిలో అప్పులు చేసిన ఘనత కు రేవంత్ సర్కార్ వెళ్లిందంటే ఏ రేంజ్ లో రుణాలు తీసుకుంటున్నారో చూడొచ్చు. ఆదాయం, వ్యయాలతో సంబంధం లేకుండా ఎడాపెడా అందిన కాడికి డబ్బులు గుంజుకొస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వాలపై గగ్గోలు పెట్టిన రేవంతుడు., ఇప్పుడు తన పాలనలో మాత్రం అప్పులేనిదే ముద్దముట్టడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. ప్రజాపాలన దేవుడెరుగానీ, ప్రజా జీవనం అప్పులు ఊబిలో కూరుకుపోయి ఆగమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంత చేసినా ఓ కొత్త ప్రాజెక్టో, పథకమో ప్రారంభించారా అంటే అదీ లేదు. కాంగ్రెస్ సర్కార్ చేసే పొక్కలు పూడ్చాలంటే ఎక్కడి కుప్పలు తేవాలి., మరెక్కడి నుంచి రాబట్టాలో…?
========================
జనపదం, బ్యూరో
“ అప్పు పుట్టింది బిడ్డా.. అంటే కొంప మునిగింది కొడుకా..” అన్నట్టుగా మారింది రాష్ట్ర అర్థిక పరిస్థితి. ప్రభుత్వ పాలన అప్పుల మీదే నడుస్తున్నది. ఆదాయం కంటే అప్పులే ఎక్కువ తీసుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం సగంలోనే 46 వేల కోట్ల అప్పు తీసుకున్నారు. ఇందులోనూ అప్పుల్లో జూలై రికార్డు సృష్టించింది. జూలై ఒక్క నెలలో ఏకంగా 10,392 కోట్ల రుణం తీసుకుని ప్రభుత్వం రికార్డును సృష్టించింది. ఈ ఏడాది జూలైలో ఏకంగా రూ.10,392 కోట్ల అప్పు చేసింది. తద్వారా గత పదేండ్లలో ఎన్నడూ లేనివిధంగా ఒకే నెలలో రూ.10 వేల కోట్లకుపైగా అప్పుతో ‘చరిత్ర’ సృష్టించింది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు నివేదించింది. రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా గత ప్రభుత్వం మార్చితే.. ఇప్పుడు అదే తంతు కొనసాగుతున్నట్లుగా మారింది.
అప్పే ఎక్కువ..
రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జూలైలో వచ్చిన ఆదాయం కంటే రేవంత్‌రెడ్డి సర్కారు తెచ్చిన అప్పే ఎక్కువ. జూలైలో పన్నుల రూపేణా దాదాపు రూ.9,966 కోట్లు, నాన్-ట్యాక్స్ రెవెన్యూ కింద రూ.257 కోట్లు, లోన్లు, అడ్వాన్సుల రికవరీ రూపంలో రూ.3.62 కోట్లు కలిపి రాష్ర్టానికి మొత్తంగా రూ.10,226.46 కోట్ల ఆదాయం వచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఇదే నెలలో ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ.10,392.71 కోట్లు. ఈ లెక్కన రాష్ర్టానికి వచ్చిన ఆదాయం కంటే అప్పే రూ.141.13 కోట్లు ఎక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి 4 నెలలను పరిశీలిస్తే జూలైలో రాబడి గణనీయంగా తగ్గినట్టు స్పష్టమవుతున్నది. ఏప్రిల్‌లో రూ.11,821 కోట్లు, మే నెలలో రూ.11,332 కోట్లుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం.. జూన్‌లో రూ.12,465 కోట్లకు పెరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. దీనితో పోలిస్తే జూలైలో ప్రభుత్వ రాబడి రూ.2,239 కోట్లు, నిరుడు ఇదే సమయంలో వచ్చిన రాబడి కంటే రూ.1,091 కోట్లు తగ్గింది. అయితే, బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో అత్యధికంగా ఒకే నెలలో చేసిన అప్పు రూ.9,897 కోట్లు మాత్రమే. 2020 డిసెంబర్‌లో ఆ రుణాన్ని తీసుకున్నది. అయితే ఆ ఏడాది కరోనా విజృంభించడం, లాక్‌డౌన్ తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు స్తంభించాయి. ప్రభుత్వాలకు రాబడి పడిపోయింది. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వ నిర్వహణతోపాటు సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు కేసీఆర్ ప్రభుత్వం 2020 డిసెంబర్‌లో భారీగా రుణం తీసుకోవాల్సి వచ్చింది. కానీ, ఈ ఏడాది జూలైలో అలాంటి పరిస్థితులేమీ లేవు. అయినా ప్రజాపాలన పేరుతో రేవంత్‌రెడ్డి సర్కారు ఒకే నెలలో రూ.10 వేల కోట్లకుపైగా అప్పు చేసింది. అయినా ఆ అప్పుతో కొత్త పథకాన్నో, ప్రాజెక్టునో చేపట్టిన దాఖలాలేమీ లేకపోవడం గమనార్హం.
సగం అప్పు పుట్టింది..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.69,012 కోట్ల అప్పులు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో బహిరంగ మార్కెట్ నుంచి రూ.57,112 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3,900 కోట్లు, ఇతర రుణాల రూపంలో రూ.1,000 కోట్లు సమీకరించనున్నట్టు బడ్జెట్‌లో వివరించింది. కానీ, ఇప్పటివరకు బాండ్ల వేలం ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి రూ.31 వేల కోట్ల రుణాలు సేకరించింది. అంటే ఈ ఏడాది బడ్జెట్‌లో పెట్టుకున్న లక్ష్యంలో సగానికిపైగా అప్పును కేవలం 5 నెలల్లోనే చేసిందన్నమాట. దీంతో మిగతా 7 నెలల్లో రేవంత్ సర్కారు రాష్ట్ర ప్రజల నెత్తిపై ఇంకెంత అప్పుల మూటను పెడుతుందోనని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెలలో ఇప్పటికే 1,500 కోట్ల అప్పు..
బాండ్ల వేలం ద్వారా ఈ నెల 3న రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి రూ.2,500 కోట్ల అప్పు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మరో రూ.1,500 కోట్ల రుణాన్ని రెండు వారాల కిందటే తీసుకున్నది. దీంతో వారం రోజుల్లోనే రూ.4 వేల కోట్ల అప్పు తీసుకున్నట్టయింది. దీంతో గత 9 నెలల్లో రేవంత్‌రెడ్డి సర్కారు ఆర్బీఐ నుంచి తెచ్చిన అప్పులే రూ.46,118 కోట్లకు చేరాయి.
ఇంకో 500 కోట్లు..
ప్రస్తుత ప్రభుత్వానికి అప్పు తీసుకోక తప్పడం లేదు. ఇప్పుడు మరో 500 కోట్ల రుణం తీసుకోవడానికి చర్యలు చేపట్టింది. ఈ నెల 17న మరో రూ.500 కోట్ల అప్పు సమీకరించుకుంటున్నది. 500 కోట్ల విలువైన బాండ్‌ను 12 ఏండ్లకాలానికి రాష్ట్ర ఆర్థికశాఖ భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కు జారీచేసింది. ఈ బాండ్‌ను ఈ నెల 17న ఆర్బీఐ వేలం వేయనున్నది. అనంతరం ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరనున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనాపగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు రూ.46,118 వేల కోట్ల అప్పు చేసింది. వచ్చే రూ.500 కోట్లతో కలిపి రాష్ట్ర రుణం 46,618 కోట్లకు చేరనుంది. ఈ నెలలో ఇప్పటికే 3వ తేదీన రూ.2,500 కోట్లు, 10న 1,500 కోట్లు.. ఇలా వారం రోజుల్లోనే రూ.4,000 కోట్లు రుణం పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ నెల 17న మరోసారి రూ.500 కోట్లు అప్పు తీసుకోనున్నది. ప్రతి నెలా రూ.5 వేల నుంచి 6 వేల కోట్ల విలువైన బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటున్నది. దీంతో ప్రజా పాలన అంటూ చెప్తున్న ప్రభుత్వం.. మొత్తానికి అప్పుల పాలనను మాత్రం కొనసాగిస్తున్నది.