Saturday, January 4, 2025
HomeNationalHottest April-2024 | అత్యంత వేడి నెలగా ఏప్రిల్‌.. వెల్లడించిన కోపర్నికస్‌ క్లైమేట్‌ చేంజ్‌ సర్వీస్‌..

Hottest April-2024 | అత్యంత వేడి నెలగా ఏప్రిల్‌.. వెల్లడించిన కోపర్నికస్‌ క్లైమేట్‌ చేంజ్‌ సర్వీస్‌..

Hottest April-2024 | ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ఏప్రిల్‌-2024 ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడి నెలగా నిలిచింది. ఈ విషయాన్ని యూరోపియన్ యూనియన్ వాతావరణ సంస్థ ‘కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్’ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం నివేదికను విడుదల చేసింది. ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వర్షపాతం, వరదలు అనేక దేశాల్లో జనజీవనానికి ఆటంకం కలిగించినట్లు తెలిపింది.

వరుసగా పదకొండవ నెల ఏప్రిల్‌లో కూడా రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయిందని చెప్పింది. ఎల్‌నినో ప్రభావం తగ్గి.. మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల ప్రభావంతోనే ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతాయని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. పారిశ్రామికీకరణకు ముందుకాలమైన 1850-1900తో పోల్చితే ఏప్రిల్‌ 2024లో ప్రపంచ ఉష్ణోగ్రత సగటు 15.03 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగాయని.. గణనీయంగా 1.58 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదల నమోదైందని నివేదిక పేర్కొంది. ఏప్రిల్ 1991-2020 సగటుతో పోల్చితే 0.67 డిగ్రీలు అధికమంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

ఎల్‌నినో తదితర ప్రకృతి చర్యలతో ముడిపడి ఉన్న పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు పెరుగడం, తగ్గడం సాధారణ విషయమేనని కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ డైరెక్టర్ కార్లో బ్యూంటెంపో అన్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఎల్‌నినో గరిష్ఠ స్థాయికి చేరుకుందని, తూర్పు ఉష్ణమండల పసిఫిక్‌ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ప్రస్తుతం తటస్థ స్థితికి చేరుతున్నాయని ఆయన తెలిపారు. గ్రీన్‌హౌస్ వాయువుల పరిణామం పెరుగుతుండడంతో సముద్రంలో, వాతావరణంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు కారణమవుతున్నాయని కార్లో వివరించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు