Wednesday, January 1, 2025
HomeNationalHaryana | హర్యానాలో బీజేపీ సర్కారు కూలబోతుందా..? అసెంబ్లీలో ఎవరి బలాలు ఎంత..?

Haryana | హర్యానాలో బీజేపీ సర్కారు కూలబోతుందా..? అసెంబ్లీలో ఎవరి బలాలు ఎంత..?

Haryana | హర్యానాలో బీజేసీ సర్కారుకు గట్టి షాక్‌ తగిలింది. కాషాయ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్‌లో చేరారు. అయితే, రైతులతో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయబ్‌ సింగ్‌ సైనికి షాక్‌ తగిలినట్లయ్యింది. ప్రస్తుతం ప్రభుత్వం మైనారిటీలో పడింది. ప్రస్తుతం ప్రతిపక్షాలు సైనీని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

90 అసెంబ్లీ సీట్లున్న హర్యానా అసెంబ్లీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయి.. ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది ఎమ్మెల్యేలు అవసరం. బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్‌కు 30 మంది, జననాయక్‌ జనతా పార్టీకి 10 మంది, స్వతంత్రులు ఏడుగురు ఉన్నారు. అలాగే హర్యానా లోక్‌హిత్‌ పార్టీకి ఒకరు. ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీకి ఆరు సీట్లు దూరంలో నిలిచింది. బీజేపీకి ఏడుగురు స్వత్రంత్ర ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. దాంతో సభ్యుల బలం 47కి పెరగ్గా.. నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

తాజాగా ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతును ఉపసంహరించారు. దాంతో సర్కారు బలం 44కి తగ్గింది. మెజారిటీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అవసరం. కాంగ్రెస్‌కు 30 మంది సభ్యులు ఉండగా.. ముగ్గురి మద్దతుతో బలం 33కి పెరిగింది. అయితే, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 13 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. దాంతో ప్రస్తుతం ఎవరికీ మెజారిటీ లేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి గవర్నర్‌ నిర్ణయంపై ఆధారపడి ఉన్నది. ఆయన ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొన్నది.

సాధారణంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకి బలం ఉంటే.. ఆ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తారు. ఆ పార్టీకి పది రోజులు గడువు ఇచ్చి మెజారిటీని నిరూపించుకునే అవకాశం ఇస్తారు. ఈ క్రమంలో నాయబ్‌ సింగ్‌ సర్కారుకు మెజారిటీని నిరూపించుకునేందుకు అవకాశం ఉన్నది. పదిరోజుల్లోనే ఇద్దరు సభ్యుల మద్దతు కూడగట్టగలిగితే బీజేపీ సర్కారు కొనసాగుతుంది. లేకపోతే కూలిపోయే అవకాశాలు లేకపోలేదు.

RELATED ARTICLES

తాజా వార్తలు