Friday, January 3, 2025
HomeNationalNEET Student | నా వ‌ద్ద రూ.8 వేలు ఉన్నాయ్‌.. ఐదేండ్ల‌కు స‌రిపోతాయ్‌.. కోటాలో అదృశ్య‌మైన...

NEET Student | నా వ‌ద్ద రూ.8 వేలు ఉన్నాయ్‌.. ఐదేండ్ల‌కు స‌రిపోతాయ్‌.. కోటాలో అదృశ్య‌మైన నీట్ విద్యార్థి

కోటా: కోటా (Kota) అన‌గానే కోచింగ్ సెంట‌ర్లు గుర్తుకు వ‌స్తాయి. కానీ గ‌త కొంత కాలంగా చ‌దువుల ఒత్తిడి త‌ట్టుకోలేక విద్యార్థులు బ‌ల‌వంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. మ‌రికొంద‌రు త‌ల్లి దండ్రుల‌కు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి ఘ‌ట‌నే తాజాగా చోటుచేసుకున్న‌ది. రాజ‌స్థాన్‌లోని గంగారాంపూర్ బమన్‌శాస్‌కు చెందిన రాజేంద్ర మీనా (Rajendra Meena) అనే విద్యార్ధి కోటాలో మెడికల్‌ ప్రవేశ పరీక్ష నీట్ (NEET Student)కు సిద్ధమవుతున్నాడు. స్థానికంగా ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటూ కోచింగ్‌ క్లాస్‌లకు హాజరవుతున్నాడు. ఏమైందో ఏమో మే 6న ఒక్క‌సారిగా అత‌డు క‌నిపించ‌కుండా పోయాడు. అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు కోటాలో తాను ఉంటున్న పేయింగ్ గెస్ట్ హాస్ట‌ల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయాడు.

అక్క‌డి నుంచి పోయేముందు తన తండ్రి జగదీశ్‌ మీనాకు ఫోన్‌లో ఓ మెసేజ్‌ పంపాడు. ‘నేను ఐదేండ్ల‌ పాటు ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను. నా చదువును కొనసాగించాలని అనుకోవడం లేదు. ఇప్పుడు నా ద‌గ్గ‌ర‌ రూ.8 వేలు ఉన్నాయి. అవి ఐదేండ్ల‌కు సరిపోతాయి. నా ఫోన్‌ కూడా అమ్మేస్తున్నాను. సిమ్‌ను ప‌డేస్తున్నాను. నా గురించి చింతించొద్దని అమ్మకు చెప్పండి. నేను ఎలాంటి రాంగ్‌ స్టెప్‌ తీసుకోను. మీ అందరి నంబర్లూ నా దగ్గర ఉన్నాయి. అవసరమైతే తప్పకుండా ఏడాదికి ఒకసారి కచ్చితంగా ఫోన్‌ చేస్తా’నంటూ తన తండ్రికి మెసేజ్ చేశాడు.

అయితే కుమారుడి నుంచి వచ్చిన మెసేజ్‌ చూసిన‌ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్ర‌యించారు. తమ కుమారుడు రాజేంద్ర మీనా మిస్సింగ్‌ విషయం వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్ధి అచూకీ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, కోటాలోని కోచింగ్ సెంటర్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడికి ఇది సాక్ష్యంగా నిలుస్తుంది. ఇప్పటికే ఎంతో మంది విద్యార్ధులు అక్కడి నుంచి పారిపోయారు. మ‌రికొంద‌రైతే అర్ధంత‌రంగా త‌నువుచాలిస్తున్నారు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు