Tuesday, January 7, 2025
HomeCinemaChiranjeevi | ప‌ద్మ‌విభూష‌ణ్ పుర‌స్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi | ప‌ద్మ‌విభూష‌ణ్ పుర‌స్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

న్యూఢిల్లీ: దేశంలో రెండో అత్యున్న‌తమైన ప‌ద్మ‌విభూష‌న్ పుర‌స్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అందుకున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసనతోపాటు కుటుంబ స‌భ్యులు హాజ‌ర‌య్యారు. గ‌తంలో ఆయ‌న ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు అందుకున్న విష‌యం తెలిసిందే.

భారత గణతంత్ర్య దినోత్సవం వేళ దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండో విడత కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవితో పాటు ప్రఖ్యాత నృత్యకారిణి, సీనియర్‌ నటీమణి వైజయంతిమాల బాలి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులు మీదుగా పద్మ విభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి దివంగత ఎం.ఫాతిమా బీవీని మరణాంతరం ఈ పురస్కారంతో గౌరవించారు. హోర్ముస్జీ ఎన్‌.కామా గురువారం పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు.

తొలి విడుత‌లో భాగంగా ఏప్రిల్‌ 22న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు సగం మందికి పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి, మిగిలిన‌ వారికి గురువారం సాయంత్రం అందజేశారు. ఈ ఏడాది మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించగా, వీటిలో 5 పద్మవిభూషణ్‌, 17 పద్మభూషణ్‌, 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఇందులో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. 9 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది.

పద్మవిభూషణ్..

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవి, సీనియర్‌ నటీమణి వైజయంతి మాల బాలి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం, సులభ్‌ శౌచాలయ సృష్టికర్త దివంగత బిందేశ్వర్‌ పాఠక్​కు పద్మవిభూషణ్ అవార్డులను కేంద్ర ప్ర‌భుత్వం ప్రకటించింది.

పద్మభూషణ్..

దివంగత జస్టిస్‌ ఫాతిమా బీవీ, కేంద్ర మాజీమంత్రి రామ్‌నాయక్‌, మరో కేంద్ర మాజీ మంత్రి ఒ.రాజగోపాల్‌, ప్రముఖ గాయని ఉషా ఉథుప్‌, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ ద్వయంలో ఒకరైన ప్యారేలాల్‌ శర్మ, నటుడు మిథున్‌ చక్రవర్తి, కోలీవుడ్​ దివంగత నటుడు విజయ్‌కాంత్‌ సహా పలువురికి పద్మభూషణ్ అవార్డులను ప్రకటించిన విష‌యం తెలిసిందే.

 

RELATED ARTICLES

తాజా వార్తలు