Wednesday, January 1, 2025
HomeTelanganaNavneet Kaur Rana | చిక్కుల్లో అమరావతి ఎంపీ నవనీత్‌ కౌర్‌.. షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు...

Navneet Kaur Rana | చిక్కుల్లో అమరావతి ఎంపీ నవనీత్‌ కౌర్‌.. షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

Navneet Kaur Rana | అమరావతి ఎంపీ, సినీ నటి నవనీత్‌ కౌర్‌ రాణాపై కేసు నమోదైంది. ఇటీవల షాద్‌నగర్‌లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నవనీత్‌ కౌర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే పాకిస్థాన్‌కు వేసినట్లే’నని వ్యాఖ్యానించారు. ఈ నేతలపై కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలను సైతం ఎన్నికల సంఘం సైతం తీవ్రంగా పరిగణించింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) నిబంధనలను ఉల్లంఘించినందుకు షాద్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇటీవల షాద్‌నగర్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా నవనీత్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నవనీత్‌ కౌర్‌ ఓవైసీ సోదరులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘మాకు 15 నిమిషాలు కాదు.. 15 సెకన్ల సమయం ఇస్తే చాలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు ఎక్కడి నుంచి వచ్చారో.. ఎక్కడికి వెళతారో తెలియకుండా ఉంటుందది’ అంటూ హెచ్చరించారు. 2013లో అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నవనీత్‌ గుర్తు చేశారు. 15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే 100 కోట్ల మంది హిందువుల అంతు చూస్తామని ఆ సమయంలో అక్బరుద్దీన్ హెచ్చరించారు.

ఆ వ్యాఖ్యలకు నవనీత్ కౌర్ నేడు కౌంటర్ ఇచ్చారు. నవనీత్‌ రాణా వ్యాఖ్యలపై ఎంపీ అసదుద్దీన్ స్పందించారు. మీరు 15 సెకండ్లు అడుగుతున్నారని.. ప్రధాని మోదీని గంట సమయం ఇవ్వండని కోరుతున్నానని.. అప్పుడు మీలో ఎంత మానవత్వం మిగిలి ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నామన్నారు. ఎవరూ భయపడేవారు లేరని.. తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. ప్రధాని, ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌ మీదని.. ఎవరు ఆపుతున్నారని ప్రశ్నించారు. ఎక్కడకు రమ్మంటే తాను అక్కడకు వస్తానని.. ఆయన ఏం చేస్తారో చేయాలంటూ సవాల్‌ విసిరారు.

RELATED ARTICLES

తాజా వార్తలు