Wednesday, January 1, 2025
HomeTelanganaTelangana | నేటితో ఎన్నిక‌ల ప్ర‌చారానికి తెర‌.. ఇక మిగిలింది పోలింగ్ పోరే..!

Telangana | నేటితో ఎన్నిక‌ల ప్ర‌చారానికి తెర‌.. ఇక మిగిలింది పోలింగ్ పోరే..!

Telangana | హైద‌రాబాద్ : తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం హోరాహోరీగా కొన‌సాగింది. ఈ ఎన్నిక‌ల ప్ర‌చారానికి శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల‌కు తెర ప‌డ‌నుంది. ఇక మిగిలింది పోలింగ్ ప్ర‌క్రియ‌నే. మే 13వ తేదీన ఉద‌యం 7 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే 106 అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో ఉద‌యం 7 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. మిగ‌తా 13 నియోజ‌క‌వ‌ర్గాల్లో సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కే పోలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగ‌నుంది. ఎందుకంటే ఆ 13 స‌మ‌స్యాత్మ‌క నియోజ‌క‌వ‌ర్గాలు కాబ‌ట్టి.

ఇక ప్ర‌చార విష‌యానికి వ‌స్తే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కంటి మీద కునుకు లేకుండా ఎన్నిక‌ల ర‌ణ‌క్షేత్రంలో పాల్గొన్నాయి. మెజార్టీ స్థానాల‌ను కైవ‌సం చేసుకునే దిశ‌గా ఈ మూడు పార్టీలు ప‌ర‌స్ప‌ర విమ‌ర్శలు, ఆరోప‌ణ‌ల‌తో ప్ర‌చారం కొన‌సాగించాయి. ఇక ఈ మూడు పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధ‌మే జ‌రిగింది.

బీఆర్ఎస్ త‌ర‌పున ఆ పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు హ‌రీశ్‌రావు, కేటీఆర్, ఇత‌ర నాయ‌కులు రాష్ట్ర‌మంతా విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హించారు. కేసీఆర్ బ‌స్సు యాత్ర‌తో రోడ్ షోల్లో పాల్గొన్నారు. కార్న‌ర్ మీటింగ్స్‌లో మాట్లాడుతూ.. తెలంగాణ ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో నెల‌కొన్న స‌మ‌స్య‌లను కేసీఆర్ లేవ‌నెత్తి.. ప్ర‌జ‌ల్లో ఆలోచ‌న క‌ల‌గ‌జేశారు. కొత్త జిల్లాలు ర‌ద్దు చేస్తామ‌ని రేవంత్ అంటున్నార‌ని కేసీఆర్ త‌న ప్ర‌సంగాల్లో పేర్కొన్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎజెండాగా కేసీఆర్ ప్ర‌చారం కొన‌సాగింది. ఆలోచించి ఓటేయాల‌ని, ఆగ‌మాగం కావొద్ద‌ని కేసీఆర్ సూచించారు.

అధికార కాంగ్రెస్ పార్టీ కూడా విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హించింది. మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా తెలంగాణ వ్యాప్తంగా ప‌ర్య‌టించి ప్ర‌చారం చేశారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కూడా అత్య‌ధిక స్థానాలు కైవ‌సం చేసుకోవాల‌నే ల‌క్ష్యంగా కాంగ్రెస్ నేత‌లు ప్ర‌చారం నిర్వ‌హించారు. అయితే ప‌రుష ప‌ద‌జాలం ఉప‌యోగించి, విన‌డానికి కూడా అస‌భ్యంగా ఉండే భాష‌ను కాంగ్రెస్ నేత‌లు ప్ర‌యోగించారు.

బీజేపీ ప్ర‌చారంలో ప్ర‌ధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల అవినీతి, కుటుంబ పాల‌న‌పై విమ‌ర్శ‌లు సంధించింది. కాంగ్రెస్ హ‌యాంలో రాష్ట్రం అవినీతిమ‌యంగా మారింద‌ని, బిల్డ‌ర్లు, కాంట్రాక్ట‌ర్లు, కంపెనీల వ‌ద్ద వ‌సూళ్లు మొద‌లు పెట్టార‌ని, రాష్ట్రంలో డ‌బుల్ ఆర్ ట్యాక్స్ న‌డుస్తోంద‌ని విమ‌ర్శించారు. ఆరు గ్యారెంటీల అమ‌ల్లో కాంగ్రెస్ విఫ‌ల‌మైంద‌న్నారు. ప్ర‌ధాని మోదీతో పాటు ప‌లువురు కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల బీజేపీ ముఖ్య‌మంత్రులు తెలంగాణ‌లో ప్ర‌చారం నిర్వ‌హించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు