KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గానే ఉంటుందని, తన జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తాను.. అందులో అనుమానం అక్కర్లేదు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చిచెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందరితో చర్చించి ప్రాంతీయ శక్తుల ఐక్యతకు కొనసాగిస్తాను అని స్పష్టం చేశారు కేసీఆర్. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు.
జాతీయ రాజకీయాల్లోకి రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చాం.. ఆ ప్రయత్నం చేశాం. మహారాష్ట్రలో కార్యక్రమాలు చేపట్టాం. అక్కడ్నుంచి వచ్చిన కొంత మంది నాయకులు.. అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. మీ పేరు చెప్పుకుని మేం గెలుస్తాం. మా దగ్గర మార్పు రావాలి. మీ ప్రభుత్వంలో అమలైన పథకాలు రావాలని ప్రజలు కోరుతున్నారు. మిమ్మల్ని తీసుకురావాలని కోరుతున్నారు. మా దగ్గర భయంకరమైన అనిశ్చితి ఉందన్నారు. నా జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తాను. అనుమానం లేదు. ఎన్నికల తర్వాత అందరితో చర్చించి ప్రాంతీయ శక్తుల ఐక్యతకు కృషి చేస్తాను. నా తెలివితేటలను రంగరించి అన్ని ప్రయత్నాలు చేస్తాను. ఇప్పటికే చాలా మందితో మాట్లాడుతున్నాను. అందరం కలిసి ప్రత్యామ్నాయం రూపొందింస్తాం అని కేసీఆర్ తెలిపారు.
పార్టీ మారేటోళ్లంతా పవర్ ఫ్లవర్స్..
నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఈ సన్ ఫ్లవర్ గ్యాంగ్ ఎక్కువగా తయారైంది. పొద్దు తిరిగినట్టు తిరుగుతారు. ఇవన్నీ పవర్ ఫ్లవర్స్.. కాంగ్రెస్ను గెలిపించేందుకు కాదు వాళ్ల స్వార్థం కోసం వాళ్ల పైరవీల కోసం వాళ్ల స్వలాభం కోసం పోతున్నారు. అందరు పోలేదు. బీఆర్ఎస్ ఒక మహాసముద్రం 60 లక్షల సభ్యత్వం ఉంది. బీఆర్ఎస్ను ఎలిమినేట్ చేస్తామంటే అది అహంకారం. లక్షల రేవంత్ రెడ్డిలు వచ్చినా వెంట్రక మందం ఫరాక్ పడదు అని కేసీఆర్ స్పష్టం చేశారు.