Wednesday, January 1, 2025
HomeAndhra PradeshAP Voters | 9 గంట‌లు ఆల‌స్యంగా రైలు.. ఓటుకు అందుకుంటామా అనే ఆందోళ‌న‌లో 5...

AP Voters | 9 గంట‌లు ఆల‌స్యంగా రైలు.. ఓటుకు అందుకుంటామా అనే ఆందోళ‌న‌లో 5 వేల మంది

AP Voters | వాళ్లంతా నాందేడ్ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి (AP Voters) ఓటేయ‌డానికి వ‌స్తున్నారు. ముందుగానే నాందేడ్‌-విశాఖ‌ప‌ట్నం రైలులో టికెట్లు బుక్‌చేసుకున్నారు. నాందేడ్‌లో స‌మ‌యానికే బ‌య‌ల్దేరిన ఆరైలు.. వ‌స్తావుంటే ఆల‌స్య‌మ‌వుతున్న‌ది. సికింద్రాబాద్ చేరుకునే స‌రికి సోమ‌వారం తెల్లారింది. దీంతో త‌మ నియోజ‌క‌వ‌ర్గాలకు ఎప్పుడు వెళ్తామో.. అస‌లు ఓటేస్తామా లేదా అనే ఆందోళ‌న‌లో ప్ర‌యాణికులు ఉన్నారు.

నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మే 12వ తేదీ రాత్రి 9.30 గంట‌ల‌కు రావాల్సి ఉంది. అయితే 5-6 గంటలు ఆలస్యంగా రావడంతో 13న (సోమ‌వారం) తెల్లవారుజామున 3 నుంచి 4 గంటలకు చేరుకుంది. దీంతో మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మ‌ధ్య తమ నియోజకవర్గాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటామ‌ని భావించారు. అయితే ప్రస్తుతం ఈ ఆలస్యం కాస్త 9 గంటలకు చేరింది. దీంతో వారిలో ఆందోళ‌న మొద‌లైది. రైలులో ఎక్కువమంది తాడేపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వరకు వెళ్లే ప్రయాణికులు ఉన్నారు. కేవలం రైలు ఆలస్యం కారణంగానే తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోతామేమో అన్న నిరుత్సాహం, ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ఆ రైలు విశాఖపట్నం చేరుకోవడానికి సాయంత్రం 6 గంటలు అయ్యే అవకాశం ఉంది.

ఇప్పటి నుంచి రైలు సరైన వేగంతో వెళ్తే త‌ప్ప‌ సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి విశాఖకు చేరుకునే అవ‌కాశం లేదు. సాధార‌ణంగా నాందేడ్ నుంచి విశాఖ వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ 13 వతేది ఉదయం 9 గంటలకు విశాఖపట్నం రావాల్సి ఉంది. మధ్యాహ్నం 2 గంటలు అయినప్పటికీ రాజమండ్రికి రాలేదు. అక్క‌డి నుంచి విశాఖపట్నం చేరుకోవాలంటే 3 నుంచి 4 గంటలు పడుతుంది. దీంతో ఐదేండ్ల‌కు ఒకసారి వచ్చే తమ ఓటు హక్కును కోల్పోతామన్న నిరుత్సాహంలో ప్ర‌యాణికులు ఉన్నారు. ఈ సమస్యపై రైల్వే అధికారులకు, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. ఈ రైలులో సుమారు 5 వేల మందికిపైగా ప్రయాణీకులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్దంగా ఉన్నారని చెబుతున్నారు. తమ ప్రమేయం లేకుండా జరిగిన ఈ అసౌకర్యాకిని న్యాయం చేయాలని కోరుతున్నారు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు