Wednesday, January 1, 2025
HomeSportsBCCI | రాహుల్‌ ద్రవిడ్‌ ప్లేస్‌లో టీమిండియాకు కొత్త హెడ్‌కోచ్‌..! దరఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ..!

BCCI | రాహుల్‌ ద్రవిడ్‌ ప్లేస్‌లో టీమిండియాకు కొత్త హెడ్‌కోచ్‌..! దరఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ..!

BCCI | టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవికి బీసీసీఐ సోమవారం రాత్రి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 27న సాయంత్రం 6గంటల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత జాబితాను షార్ట్‌లిస్ట్‌ చేసి ఒకరిని కోచ్‌గా నియమించనున్నట్లు పేర్కొంది. హెడ్‌ కోచ్‌ పదవీకాలం 3.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ ఏడాది జులై ఒకటి నుంచి మొదలై 2027 డిసెంబర్‌ 31 వరకు పదవీ కాలం ఉంటుందని పేర్కొంది. కోచ్‌ దరఖాస్తుదారులకు నిబంధనలు సడలిస్తూ నిర్ణయం తీసుకున్నది.

ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే వ్యక్తి కనీసం 30 టెస్టు మ్యాచ్‌లు, 50 వన్డే మ్యాచ్‌లు ఆడి ఉండాలి. టెస్ట్‌ ఆడే దేశానికి హెడ్‌కోచ్‌గా రెండేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి. లేదంటే ఐపీఎల్‌లో హెడ్‌ కోచ్‌.. అందుకు సమానమైన లీగ్‌, ఫస్ట్‌క్లాస్‌ జట్లు, జాతీయ ఏ జట్లకు కోచ్‌గా కనీసం మూడేళ్లు పని చేసిన అనుభవం, 60 సంవత్సరాల వయసు దాటకుండా ఉండాలని తెలిపింది. ఇదిలా ఉండగా.. టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తున్నది. అయితే, ద్రవిడ్‌ మళ్లీ కోచ్‌ బాధ్యతలు చేపట్టేందుకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని ఇటీవల బీసీసీఐ కార్యదర్శి జై షా వ్యాఖ్యానించారు. మళ్లీ ద్రవిడ్‌ కోచ్‌గా దరఖాస్తు చేస్తాడా? అంటే దాదాపు అవకాశాలు లేవని తెలుస్తున్నది.

ద్రవిడ్‌ 2021 నవంబర్‌ నుంచి టీమిండియా హెడ్‌ కోచ్‌ బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం కుటుంబంతో సమయం గడపాలని కోరుకుంటున్నాడు. ద్రవిడ్‌కు ఇద్దరు పిల్లలు ఉండగా.. ఇద్దరూ క్రికెట్‌ ఆడుతున్నారు. కుటుంబంతో గడిపేందుకు సమయం దొరకడం లేదని ఇటీవల ద్రవిడ్‌ సైతం వ్యాఖ్యానించగా.. ఈ పరిస్థితుల్లో మళ్లీ కోచ్‌గా బాధ్యతలు చేపట్టబోడని స్పష్టమవుతున్నది. వాస్తవానికి వన్డే వరల్డ్‌ కప్‌లోనే ద్రవిడ్‌ పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత బీసీసీఐ అతనితో మాట్లాడి కోచ్‌గా కొనసాగేందుకు ఒప్పించింది. మరో వైపు టీమిండియా కొత్త కోచ్‌ నేతృత్వంలో కీలక సిరీస్‌లు, టోర్నీల్లో ఆడబోతున్నది.

కొత్త కోచ్‌ పదవీ కాలం శ్రీలంకలో జులై జరిగే వైట్‌బాల్‌ సిరీస్‌తో మొదలవనున్నది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌లతో సొంతగడ్డపై రెండు టెస్టు సిరీస్‌లు ఆడనుంది. సంవత్సరం చివరలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్ కూడా ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. 2025లో పాక్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీతో పాటు అదే ఏడాది ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. 2026లో శ్రీలంకతో కలిసి సంయుక్తంగా టీ20 వరల్డ్‌ కప్‌కి ఆతిథ్యం ఇవ్వనున్నది. 2027లో వన్డే ప్రపంచకప్‌ దక్షిణాఫ్రికాలో జరుగనున్నది.

RELATED ARTICLES

తాజా వార్తలు