Chandrababu Naidu | తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్ తగిలింది. చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకుడు ఆనందబాబుపై నమోదైన క్రిమినల్ కేసులును కొట్టివేసేందుకు బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ నిరాకరించింది. 2010 నాటికి సంబంధించిన ఓ కేసులో చంద్రబాబు, ఆనందబాబును ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు తరలించే నేపథ్యంలో జైలు సిబ్బందిపై దాడికి పాల్పడ్డట్లుగా క్రిమినల్ కేసు నమోదైంది. తాజాగా ఈ కేసు విచారణకు వచ్చింది. దీనిపై జస్టిస్ మంగేశ్ పాటిల్, శైలేశ్ బ్రహ్మేలతో కూడిన బెంచ్ నేరారోపణలతో నిందితుల ప్రమేయాన్ని బయటపెట్టేందుకు అవసరమైన ఆధారాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదని అభిప్రాయపడింది.
ఘటన జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, గాయపడ్డ పోలీసులకు సైతం వైద్య పరీక్షలు నిర్వహించారన్నారు. దాంతో నేరానికి సంబంధించిన తగిన సమాచారం ఉన్నట్టేనని.. కేసును కొట్టివేయడం సముచితం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. నిందితులపై కేసు నమోదు, దర్యాప్తులో చట్టవిరుద్ధంగా ప్రవర్తించినట్లుగా అనిపించలేదని చెప్పింది. అయితే, 13 సెప్టెంబర్ 2023న చంద్రబాబుకు మంజూరు చేసిన మధ్యంతర ఉపశమనాన్ని జూలై 8 వరకు పొడిగించింది. ట్రయల్ కోర్టు ఎదుట హాజరుకాకుండా చంద్రబాబుకు మినహాయింపు మినహాయింపు దొరికింది.
కాగా, జులై 2010లో చంద్రబాబు, ఆనందబాబు, మరో 66 మందిపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నిరసన సమయంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నది. ఆ తర్వాత పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ కేసులో చంద్రబాబు, ఆనంద్ బాబు తదితరులను కలిపి మొత్తం 66 మందిని రిమాండుకు తరలించి ధర్మాబాద్‌లోని ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లోని తాత్కాలిక జైలులో ఉంచారు. తమపై దాఖలైన కేసును కొట్టేయాలని చంద్రబాబు, నక్కా ఆనంద్‌బాబు దాఖలు చేసిన రెండు పిటిషన్లు దాఖలు చేశారు.