Wednesday, January 1, 2025
HomeSportsDC vs LSG| ఓడిన ల‌క్నో.. ప్లే ఆఫ్ అవ‌కాశాలు గ‌ల్లంతైన‌ట్టే..!

DC vs LSG| ఓడిన ల‌క్నో.. ప్లే ఆఫ్ అవ‌కాశాలు గ‌ల్లంతైన‌ట్టే..!

DC vs LSG| ఈ సీజ‌న్ చాలా ర‌సవ‌త్త‌రంగా మారుతుంది. ఏ జ‌ట్టు ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది, ఏ జట్టు ఇంటికి వెళుతుంది అనేది చాలా క్లిష్టంగా మారింది.ఇప్ప‌టికే పంజాబ్, ముంబాయ్, గుజ‌రాత్ జ‌ట్లు టోర్నీ నుండి అధికారికంగా నిష్క్ర‌మించాయి. మిగ‌తా జ‌ట్లు ప్లే ఆఫ్స్‌లో స్థానం ద‌క్కించుకునేందుకు పోటీ ప‌డుతున్నాయి. గ‌త రాత్రి లక్నో-ఢిల్లీ మ‌ధ్య జ‌రిగిన బిగ్ ఫైట్ లో ఢిల్లీ గెలిచి ప్లేఆఫ్ అవ‌కాశాల‌ని కాస్త మిగిల్చుకుంది. ఇక ఓట‌మితో ల‌క్నో ప్లే ఆఫ్ అవకాశాలు మాత్రం సంక్లిష్టంగా మారాయి. అయితే ఈ రెండు జ‌ట్టు ప్లే ఆఫ్స్‌కి వెళ్ల‌డం, వెళ్ల‌క‌పోవ‌డం మిగ‌తా టీమ్స్ గెలుపోట‌ముల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 208 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్ (58; 33 బంతుల్లో, 5×4, 4×6), ట్రిస్టన్ స్టబ్స్ (57*; 25 బంతుల్లో, 3×4, 4×6) మెరుపు అర్ధ‌శ‌త‌కాలు చేయ‌డంతో ఢిల్లీ మంచి టార్గెట్ ల‌క్నో ముందు ఉంచింది.

ఇక ల‌క్ష్య చేధ‌న‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తొమ్మిది వికెట్స్ కోల్పోయి 189 ప‌రుగులు చేసింది. దీంతో ఓట‌మి చ‌వి చూడాల్సి వ‌చ్చింది. నికోలస్ పూరన్ (61; 27 బంతుల్లో, 6×4, 4×6), అర్షద్ ఖాన్ (58*; 33 బంతుల్లో, 3×4, 5×6) చివ‌రి వ‌ర‌కు పోరాడిన విజ‌యాన్ని అందించ‌లేక‌పోయారు. ఇషాంత్ శ‌ర్మ మూడు వికెట్లు తీసి 34 ప‌రుగులు ఇచ్చాడు. ఇషాంత్ అత్యుత్త‌మ బౌలింగ్‌తో లక్నో జ‌ట్టు ఇరుకున ప‌డింది. ల‌క్నోకి మొద‌ట్లోనే పెద్ద ఎదురుదెబ్బ త‌గిలింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (5; 3 బంతుల్లో, 1×4 )ను ఇషాంత్ శర్మ బోల్తా కొట్టించ‌గా, మ‌రో ఓపెన‌ర్ డికాక్‌ (12; 8 బంతుల్లో, 2×4)ను కూడా ఇషాంత్ ఔట్ చేసి ల‌క్నోకి కోలుకోలేని షాక్ ఇచ్చాడు.

ఇక ఆ త‌ర్వాత వ‌చ్చిన స్టొయినిస్ (5; 7 బంతుల్లో, 1×4), దీపక్ హుడా (డకౌట్) వెంట వెంట‌నే ఔట్ కావ‌డంతో ల‌క్నో 44/4 తో కష్టాల్లో పడింది. అయితే పూరన్ దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డు పరుగులు పెట్టించిన ఉప‌యోగం లేకుండా పోయింది. లక్నో బౌలర్ నవీనుల్ హక్ రెండు వికెట్లు తీసినా 51 పరుగులు ఇచ్చాడు. రవి బిష్ణోయ్, అర్షద్ ఖాన్ తలా ఓ వికెట్ తీశారు. లక్నోపై ఢిల్లీ విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ బెర్త్ క‌న్‌ఫాం అయింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‍ల్లో 8 గెలిచిన రాజ‌స్థాన్ జ‌ట్టు ప్లే ఆఫ్స్‌కి అర్హ పొందింది. మ‌రో రెండు లీగ్‌లు ఆడాల్సి ఉన్న‌ప్ప‌టికీ వాటితో సంబంధం లేకుండా డైరెక్ట్‌గా ప్లేఆఫ్స్ చేరింది. కాగా, కోల్ క‌తా కూడా ప్లే ఆఫ్స్‌కి చేరుకోగా, మిగ‌తా రెండు స్థానాల కోసం ఇత‌ర జ‌ట్లు పోరాడుతున్నాయి.

RELATED ARTICLES

తాజా వార్తలు