Ganesha | పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టమైన దైవం గణేశుడు (Ganesha). వినాయకుని ప్రార్ధిస్తే విఘ్నాలు తొలగుతాయని నమ్ముతారు. అందుకే ఏ శుభకార్యమైనా, పని ప్రారంభించాలన్నా ముందుగా గణపతికే పూజ చేస్తారు. అంతెందుకు దేవుడికి పూజ చేయాలన్నా తొలుత గణనాథుడిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. అయితే విఘ్నాల అధిపతికి పూజ చేయడాలంటే ఘనంగా అలంకరించాల్సిన అవసరం లేదు. ఆ కరిముఖ దేవుడికి కేవలం పత్రి సమర్పిస్తే చాలు. ఆయనకు పత్రి పూజ అంటే ఇష్టం. అందులోనూ గరిక ఇంటే చాలా ఇష్టం. గరిక లేకుండా గణపతి పూజ అసంపూర్ణమే! కొంచెం గరికతో వినాయకుని పూజిస్తే తప్పకుండా పూజాఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి.
గరికతోనే ఎందుకంటే..
పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు అగ్ని పుట్టించి లోకాలన్నిటినీ తన దావానలంతో దహించి వేయసాగాడు. ఆ వేడిమిని భరించలేని దేవతలంతా శివుని వద్దకు వచ్చి అనలాసురిని బారి నుంచి తమను కాపాడాలని వేడుకుంటారు. అప్పుడు గణేశుడు ఒక్కసారిగా తన శరీరాన్ని పెంచి ఆ అనలాసురుని మింగేసాడు. దీంతో అనలాసురుని పీడ విరగడైనందుకు దేవతలంతా సంతోషించసాగారు. కానీ ఆ రాక్షసుడిని మింగిన బొజ్జగణపయ్య శరీరం నుంచి విపరీతమైన అగ్ని పుట్టి గణపతి శరీరం మంటలు పుట్టసాగింది.
ముక్కంటి మెడలోని పాము..
దీంతో వినాయకుడి శరీరంలో మంటలు తగ్గడానికి చంద్రుడు వచ్చి అతని తలపై కూర్చున్నాడు. అయినా మంట తగ్గకపోవడంతో విష్ణువు తన కమలాన్ని గణపతికి ఇస్తాడు, ముక్కంటి తన మెడలోని పామును గణేశుని బొజ్జ చుట్టూ చుడతాడు. అయితే ఏంచేసినా లంబోధరుని శరీరంలో మంటలు తగ్గలేదు. చివరకు కొంతమంది ఋషులు వచ్చి 21 గరిక పోచలు ఘనాపాటి సమర్పిస్తే గణపతి శరీరంలో వేడి తగ్గుతుందని చెప్పారు. దీంతో 21 గరిక పోచలు గణేశుని తలపై ఉంచగానే వినాయకుని శరీరంలో మంటలు తగ్గి ఉపశమనం కలుగుతుంది.
దీంతో ఎవరైతే తనను గరికపోచలతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడూ తన ఆశీస్సులు ఉంటాయని, వారి సకల కోరికలు నెరవేరుతాయని గణేశుడు వరమిస్తాడు. దీంతోపాటు ఏ పని అయినా ప్రారంభించేటప్పుడు, శుభకార్యాల సమయంలో తనను గరికతో ఆరాధిస్తే చేసే పనుల్లో విఘ్నాలు ఉండవని వరమిస్తాడు.