Wednesday, January 1, 2025
HomeNationalPM Modi | ప్ర‌ధాని మోదీ.. వార‌ణాసి నుంచే ఎందుకు పోటీచేస్తున్నారు..

PM Modi | ప్ర‌ధాని మోదీ.. వార‌ణాసి నుంచే ఎందుకు పోటీచేస్తున్నారు..

PM Modi | ప్ర‌ధాని మోదీ (PM Modi) వార‌ణాసి నుంచి వ‌రుస‌గా మూడోసారి ఉత్త‌ర‌ప్రదేశ్‌లోని వార‌ణాసి నుంచి లోక్‌స‌భ భ‌రిలో నిలిచారు. గుజ‌రాత్‌కు చెందిన మోదీకి అహ్మ‌దాబాద్‌లో ఓటుహ‌క్కు ఉన్న‌ది. స్వ‌రాష్ట్రంలో ఆయ‌న‌కు ఎదురేలేదు. ఎక్క‌డి నుంచి పోటీ చేసినా, ప్ర‌చారం నిర్వ‌హించ‌కున్నా విజ‌యం సాధించ‌గ‌లుగుతారు. అయినా ప్ర‌ధాని వార‌ణాసి నుంచి ఎందుకు పోటీచేస్తున్నారు? అందునా వ‌రుస‌గా మూడోసారి.. అస‌లు ఆయ‌న ఆధ్యాత్మిక రాజ‌ధానిని త‌న‌కు సేఫ్ ప్లేస్‌గా ఎందుకు ఎంచుకున్నారు?..

కంచుకోట‌..

బీజేపీకి కంచుకోట‌గా ఉన్న వార‌ణాసి లోక్‌స‌భ స్థానం ఐదు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల క‌ల‌యిక‌. 1957 నుంచి ఇక్క‌డ బీజేపీ ఏడుసార్లు, కాంగ్రెస్ ఆరుసార్లు విజ‌యం సాధించాయి. 1991 నుంచి 2003 వ‌ర‌కు ఒక్క‌సారి మాత్ర‌మే కాంగ్రెస్ అభ్య‌ర్తి గెలువ‌గ‌లిగారు. 2009 నుంచి ఈ సీటుపై బీజేపీ ఏక‌చ‌త్రాధిప‌త్యం చెలాయిస్తూ వ‌స్తున్న‌ది. ఇక్క‌డ పార్టీకి ఎదురు లేక‌పోవ‌డంతో వ‌రుస‌గా మూడోసారీ ప్ర‌ధాని మోదీ పోటీచేస్తున్నారు.

23 మందికి డిపాజిట్లే ద‌క్క‌లే..

ప్ర‌ధాని మోదీ తొలిసారిగా 2014లో వార‌ణాసి నుంచి లోక్‌స‌భ బ‌రిలో నిలిచారు. అప్పుడు ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్‌పై 3,71,784 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. కేజ్రీవాల్‌కు 2,09,238 ఓట్లు రాగా, మోదీకి 5,01,022 ఓట్లు ద‌క్కించుకున్నారు. ఇక మూడో స్థానంలో నిలిచిన అజ‌య్ రాయ్ (కాంగ్రెస్‌) 75,614 ఓట్లు రాగా, కైలాష్ చౌరాసియా (స‌మాజ్‌వాదీ పార్టీ) 45,291 ఓట్లు వ‌చ్చాయి.

2019లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వార‌ణాసి నుంచి ప్ర‌ధాని మోదీ 4 ల‌క్ష‌ల 79 వేల 505 ఓట్ల‌తో విజ‌యం సాధించారు. మోదీతో 25 మంది పోటీప‌డ్డారు. అయితే వారిలో 22 మంది త‌మ డిపాజిట్లు కోల్పోయారు. ఇద్ద‌రు మాత్ర‌మే డిపాజిట్లు ద‌క్కించుకోగ‌లిగారు. స‌మాజ్‌వాదీ పార్టీకి చెందిన షాలినీ యాద‌వ్‌కు ల‌క్షా 95వేల 159 ఓట్లు (18.4 శాతం) రాగా, మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్య‌ర్తి అజ‌య్ రాయ్ ల‌క్షా 52 వేల 548 ఓట్లు (14.38 శాతం) సాధించ‌గ‌లిగారు.

మూడో ప్ర‌ధానిగా మోదీ..

ఇలా ఒకే స్థానం నుంచి వ‌రుస‌గా మూడోసారి పోటీచేస్తున్న మూడో ప్ర‌ధానిగా మోదీ నిలిచారు. అంత‌కు ముందు దేశ తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ 191, 1957, 1962లో మూడుసార్లు ప్ర‌యాగ్‌రాజ్ జిల్లాలోని ఫుల్పూర్ నుంచి ఎంపీగా ఎన్నిక‌య్యారు. ఇక అట‌ల్ బిహారీ వాజ్‌పేయి ల‌క్నో నుంచి ఐదుసార్లు ఎంపిక‌య్యారు. 1996, 1998, 1999 ఎన్నిక‌ల్లో వాజ్‌పేయి వ‌రుస‌గా ల‌క్నో పార్ల‌మెంట్ స్థానంలో గెలుపొందారు. తాజాగా ప్ర‌ధాని మోదీ 2014, 2019లో వార‌ణాసి ఎంపీగా విజ‌యం సాధించారు. మ‌రోసారి అదే స్థానం నుంచి పోటీచేస్తున్నారు. అయితే ఈసారి స‌మాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ ఒక్క‌టిగా పోటీచేస్తున్నాయి. మోదీపై కాంగ్రెస్ అజ‌య్ రాయ్‌ని బ‌రిలోకి దించింది.

ఆ రెండు సామాజికవ‌ర్గాల‌దే ఆధిప‌త్యం..

ఇక వార‌ణాసి లోక్‌స‌భ స్థానం మొత్తం జ‌నాభాలో 75 శాతం మంది హిందువులు, 20 శాతం ముస్లింలు ఉన్నారు. ఇక్క‌డ మొత్తం 19.62 ల‌క్షల మంది ఓట‌ర్లు ఉన్నారు. వీరిలో 10,65,485 మంది పురుషులు, 8,97,328 మంది మ‌హిళ‌లు ఉన్నారు. 135 మంది థర్డ్ జెండ‌ర్ ఓట‌ర్లు.

బీజేపీకి ప్ర‌ధాన ఓటుబ్యాంకుగా భావించే వైశ్య‌, బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గాల‌కు చెందినవారు ఇక్క‌డ భారీగా ఉన్నారు. గ‌రిష్ఠంగా రెండు ల‌క్ష‌ల మంది కుర్మి సామాజిక వ‌ర్గానికి చెందిన‌వారు ఉండ‌గా, 2 ల‌క్షల మంది వైశ్యులు, త‌ర్వాత బ్రాహ్మ‌ణ ఓట‌ర్లు వార‌ణాసిలో అత్య‌ధికులు ఉన్నారు. ఇక బీజేపీకి ప‌ట్ట‌ణ ప్రాంత పార్టీగా పేరున్న విష‌యం తెలిసిందే. నియోజ‌క‌వ‌ర్గంలో 65 శాతం మంది ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో, 35 శాతం జ‌నాభా గ్రామీణ ప్రాంతాల్లో నివ‌సిస్తున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు