హంసలదీవి పేరు వినగానే.. మనకు బంగాళాఖాతం గుర్తొస్తుంది. ఎందుకంటే.. కృష్ణా నది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతాన్ని హంసలదీవిగా పిలుస్తారు. మరి ఈ పేరు వెనుక పెద్ద కథనే ఉంది. మనషుల పాపాలను కడిగేసే గంగాదేవికి ఇక్కడే పాప విమోచనం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా కోరిన కోరికలు తీర్చే వేణుగోపాల స్వామి వెలసింది కూడా ఇక్కడే. ఈ ఆలయాన్ని సాక్షాత్తూ ఆ దేవతలే నిర్మించారని ప్రతీతి.
ఆ పేరు ఎలా వచ్చిందంటే..?
పాపాలు నశించాలంటే గంగా జలంలో స్నానమాచారించాలని పండితులు చెబుతుంటారు. నది సముద్రంలో కలిసే చోట స్నానమాచరిస్తే జన్మజన్మల పాపాలూ నశిస్తాయని నమ్మకం. అయితే చాలా మంది పాపాలను తొలగించుకునేందుకు గంగా నదిలో స్నానాలు ఆచరించేవారు. పాప భారాన్ని మోయలేక నదీమతల్లి విష్ణుమూర్తి వద్ద మొర పెట్టుకుందట. పాపానికి ప్రతీకైన నలుపు రంగును ధరించి కాకి రూపంలో పుణ్యనదుల్లో స్నానం ఆచరించు.. ఎక్కడైతే నీ నలుపు రంగు పోయి, తెలుపు రంగు వస్తుందో అక్కడితో నీకు పాపవిముక్తి లభిస్తుందని విష్ణువు వరమిస్తాడట. ఈ క్రమంలో గంగమ్మ కాకి రూపం దాల్చి పుణ్య నదుల్లో స్నానమాచరిస్తూ హంసలదీవి వద్దకు చేరుకుని ఆ నీటిలో మునిగిపోయిందట. ఇక అక్కడ నీళ్లలో మునగగానే ఆమె నలుపు రంగు మాయమై తెల్లటి హంసలా మారిపోయిందట. అందుకే ఈ ప్రాంతానికి హంసలదీవకి అని పేరొచ్చిందని పురాణాలు పేర్కొంటున్నాయి.
ఒక్క రాత్రిలో ఆలయ నిర్మాణం..
హంసల దీవి దగ్గర సముద్రంలో దేవతలు పుణ్య స్నానాలు ఆచరించి ఆ చోటునే స్వామిని నెలకొల్పి ఆలయాన్ని ఒక్క రాత్రిలో నిర్మించారని స్థల పురాణం పేర్కొంటుంది. ఆలయాన్ని దేవతలు నిర్మిస్తుండగా కోడి కూసే వేళకు ఒక మనిషి చూడడంతో దేవతలు శిలలుగా మారిపోయారని పురాణాల్లో పేర్కొన్నారు. సంతానం లేని వారు వేణుగోపాల స్వామిని దర్శించుకుని, మొక్కుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే సంతాన వేణుగోపాలస్వామిగా ఈ స్వామి ప్రసిద్ధి చెందాడు.
ఎలా చేరుకోవాలంటే..
హంసలదీవకి వెళ్లానుకునే వారు మొదట విజయవాడ చేరుకోవాలి. అక్కడ్నుంచి అవనిగడ్డకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలి. మళ్లీ అవనిగడ్డ నుంచి 13 కి.మీ. దూరంలో ఉన్న కోడూరు మండలానికి బస్సులు తరుచుగా ఉంటాయి. కోడూరు నుంచి ఆటోలో ప్రయాణించి హంసలదీవికి చేరుకోవచ్చు.