KKR| ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 చివరి అంకానికి చేరుకుంది. మరి కొద్ది గంటలలో ఫైనల్ జరగనుండగా, ఇందులో ఎవరు విజేతగా నిలుస్తారనేది తెలిసిపోతుంది. కోల్‌కతా, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఐపీఎల్ ఫైనల్ జరగనుండగా, రెండు జట్ల మధ్య ఫైట్ చాలా టఫ్‌గా ఉంటుందని అర్ధమవుతుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు క్వాలియర్ 1లో పోటి పడగా, ఇందులో కోల్‌కత గెలిచి డైరెక్ట్‌గా ఫైనల్‌కి చేరింది. ఇక సన్ రైజర్స్ ఆర్ఆర్‌పై గెలిచి ఫినాలేలో కోల్‌కతాపై పోటీకి సిద్ధమైంది. అయితే చెన్నైలోని చెపాక్ స్టేడియం (ఎంఏ చిదంబరం స్టేడియం)లో ఈ హైవోల్టేజీ మ్యాచ్ జరగనుండగా, ఈ పోరుకు వర్షం అంతరాయం కలిగిస్తుందేమోనని అందరిలో ఆందోళన నెలకొంది.
చెన్నైలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ రోజు పరిస్థితి ఎలా ఉంటుందా అని అందరు టెన్షన్‌లో ఉన్నారు. ఒకవేళ వర్షం కారణంగా ఫైనల్ రద్దైతే పాయింట్ల పట్టికలో కోల్‌కతా అగ్రస్థానంలో నిలిచింది కాబట్టి ఆ జట్టుకి టైటిల్ దక్కుతుంది. ఒకవేళ మ్యాచ్ జరిగిన పక్షంలో ఫైట్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండడం ఖాయం. హైదరాబాద్‌పై కేకేఆర్ రికార్డు అద్భుతంగా ఉంది. ఈ సీజన్‌లో కోల్‌కతా హైదరాబాద్‌తో రెండు మ్యాచ్‌లు ఆడగా, అందులో ఒకటి లీగ్ మ్యాచ్ కాగా, రెండోది క్వాలిఫయర్. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ కేకేఆర్ విజయం సాధించింది.
ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మొత్తం 27 సార్లు తలపడగా, ఇందులో కేకేఆర్‌దే ఆధిపత్యం కొనసాగింది. కోల్‌కతా మొత్తం 18 మ్యాచ్ లు గెలిచింది. కాగా హైదరాబాద్ కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక గత 8 మ్యాచ్‌లలో కూడా కేకేఆర్ 6 గెలవడం గమనార్హం. కేకేఆర్‌పై హైదరాబాద్ రికార్డ్ అయితే అంత బాగోలేదు. మరి ఇలాంటి పరిస్థితులలో కమ్మిన్స్ ఏమైన అద్భుతాలు చేసి తన జట్టుని గెలిపిస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది.