Sunday, December 29, 2024
HomeAndhra PradeshPinnelli Ramakrishna Reddy | ఎమ్మెల్యే పిన్నెల్లికి బిగ్ రిలీఫ్‌.. ఆ మూడు కేసుల్లో ముంద‌స్తు...

Pinnelli Ramakrishna Reddy | ఎమ్మెల్యే పిన్నెల్లికి బిగ్ రిలీఫ్‌.. ఆ మూడు కేసుల్లో ముంద‌స్తు బెయిల్‌

Pinnelli Ramakrishna Reddy | మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి (Pinnelli Ramakrishna Reddy) భారీ ఊరట ల‌భించింది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా న‌మోదైన మూడు కేసుల్లో అరెస్టు చేయ‌కుండా ఏపీ హైకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 13న రెంటచింతల మండలం పాల్వాయి గేటు ఈవీఎం ధ్వంసం కేసులో ఇప్పటికే ఆయ‌న‌కు బెయిల్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఘర్షణలతో పాటు ఇతర కేసుల్లో కూడా రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం బెయిల్ మంజూరు చేసింది. కౌంటింగ్ ముగిసే వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసుల‌ను ఆదేశించింది.

మాచర్లలో జరిగిన ఘర్షణల్లో బాధితులపై దాడికి పాల్పడటంతో పాటు నేరుగా బాధితుల్ని బెదిరింపుల‌కు పాల్ప‌డ్డార‌ని ఆయ‌న‌పై కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా మే 13, 14 తేదీల్లో జరిగిన ఘర్షణల్లో పలు అభియోగాల కింద పిన్నెల్లిపై పోలీసులు కేసులు రిజిస్ట‌ర్ చేశారు. వీటిలో ఈవీఎం ధ్వంసం కేసులో ఇప్పటికే బెయిల్ మంజూరైంది. మరోవైపు హత్యాయత్నం కేసుతో పాటు ఇతర కేసుల్లో కూడా ముంద‌స్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

సోమవారం ఇరు ప‌క్షాల‌ వాదనలు విన్న న్యాయ‌స్థానం తీర్పును నేటికి వాయిదా వేసింది. ఈ నేప‌థ్యంలో ఈ మూడు కేసుల్లో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. ఈవిఎం ధ్వంసం కేసులో విధించిన షరతులే ఈ కేసుల్లో కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. జూన్ 6 వరకు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయ‌కూడ‌ద‌ని పేర్కొంది.

ఈ నెల 13న మాచర్ల నియోజక వర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేట్ పోలింగ్‌బూత్‌లో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పినెల్లి గ‌త వారం ప‌రార‌య్యారు. అనంత‌రం ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కౌంటింగ్‌ జరిగే వరకు త‌న‌పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత పోలీసులు పిన్నెల్లిపై మరికొన్ని కేసులు నమోదు చేశారు. హత్యాయత్నం సహా, పోలీసులపై దాడి కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని కోర్టును ఆశ్రయించారు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు