హైదరాబాద్: ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు (MLC By Election) నగారా మోగింది. ఉపఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ మే 2న రానుంది. పోలింగ్‌ను అదే నెల 27న జరుగనుంది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. మే 2 నుంచి 9 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మే13న నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ. మే 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 5న ఫలితాలను ప్రకటిస్తారు.
గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగమన నియోజకవర్గం నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్నను తన పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
ఇప్పటికే దీనికి సంబంధించిన ఓటర్ నమోదు ప్రక్రియ ముగిసింది. తాజాగా తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. వారిలో 2,87,007 మంది పురుషులు, 1,74,794 మంది మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. కాగా, పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగామ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లాలు ఉన్నాయి.