RBI | ఖాతాదారుల నుంచి అదనపు చార్జీలు వసూలుచేస్తున్న బ్యాంక్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొరడా ఝులిపించింది. బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ప్రైవేటు రంగ బ్యాంకులైన ఐసీఐసీఐ, ఎస్ బ్యాంకులపై చర్యలు చేపట్టింది. ఈమేరకు ఎస్ బ్యాంక్‌కు రూ.91 లక్షలు, ఐసీఐసీఐ బ్యాంకుకు కోటి రూపాయల భారీ జరిమానా విధించింది.
జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై చార్జీలు విధించడం, ఫండ్స్ పార్కింగ్, రూటింగ్ ట్రాన్సాక్షన్ వంటి అనధికారిక ప్రయోజనాల కోసం బ్యాంక్ ఖాతాదారుల పేరుతో ఇంటర్నల్ అకౌంట్లను ఓపెన్ చేసి ఎస్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తున్నది. అయితే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. వినియోగదారులు జీరో బ్యాంక్ అకౌంట్‌ను ఉపయోగిస్తూ.. మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు అదనపు చార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అకౌంట్ బ్యాలెన్స్ జీరోకి పడిపోయి.. మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయలేదని ఖాతాదారుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయకూడదు. సంబంధిత బ్యాంకులు అకౌంట్ సేవల్ని నిలిపివేయాలి. ఈ నిబంధనలను 2014 నుంచి ఆర్‌బీఐ అమలు చేస్తోంది. అయితే దీనికి విరుద్ధంగా ఎస్ బ్యాంకు అదనపు చార్టీలు వసూలు చేస్తున్నట్లు తేలింది.
ఆర్థిక పరిస్థితులు పరిశీలించకుండానే..
మార్చి 31, 2022 నుంచి ఐసీఐసీఐ బ్యాంకు ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో ఆర్‌బీఐ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైనట్లు అందులో తేలింది. ప్రాజెక్టు రిపోర్టులు, ఆర్థిక పరిస్థితులను పరిశీలించకుండానే పలు సంస్థలకు టర్మ్‌లోన్‌లు ఇచ్చినట్లు గుర్తించింది. ఈ మేరకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లోని పలు నిబంధనల ప్రకారం ఐసీఐసీఐ బ్యాంకుపై చర్యలు తీసుకుంది. దీనిప్రకారం భారీ జరిమానా విధించింది.