Sunday, December 29, 2024
HomeNationalLok Sabha | 18వ లోక్‌స‌భ‌లో 280 కొత్త ముఖాలు.. అత్య‌ధికంగా యూపీ నుంచే

Lok Sabha | 18వ లోక్‌స‌భ‌లో 280 కొత్త ముఖాలు.. అత్య‌ధికంగా యూపీ నుంచే

Lok Sabha | న్యూఢిల్లీ : 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. ఇక మిగిలింది 18వ లోక్‌స‌భ కొలువుదీర‌డ‌మే. ఈ లోక్‌స‌భ‌లో 280 కొత్త ముఖాలు క‌నిపించ‌నున్నాయి. వీరంతా లోక్‌స‌భ‌కు తొలిసారి ఎన్నిక‌య్యారు. వీరిలో మాజీ సీఎంలు, సినీ ప్ర‌ముఖులు, మాజీ హైకోర్టు జ‌డ్జితో పాటు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు.

80 లోక్‌స‌భ స్థానాలు ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి 45 మంది తొలిసారిగా ఎన్నిక‌య్యారు. ఇందులో న‌టుడు అరుణ్ గోవిల్ ఉన్నారు. ఈయ‌న మీర‌ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు. అమేథీలో స్మృతి ఇరానీని ఓడించిన కిశోరీ లాల్ శ‌ర్మ కూడా తొలిసారిగా లోక్‌స‌భ‌లో అడుగుపెట్ట‌నున్నారు. నాగిన సీటు నుంచి పోటీ చేసిన ద‌ళిత హ‌క్కుల ఉద్య‌మ‌కారుడు చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ కూడా తొలిసారిగా ఎన్నిక‌య్యారు. ఈయ‌న ఆజాద్ స‌మాజ్ పార్టీ నుంచి విజ‌యం సాధించారు.

మ‌హారాష్ట్ర‌లో మొత్తం లోక్‌స‌భ స్థానాలు 48. ఇందులో 33 మంది తొలిసారి గెలిచారు. ఎన్సీపీ శ‌ర‌ద్ ప‌వార్ నుంచి బ‌రిలో దిగిన స్కూల్ టీచ‌ర్ భాస్క‌ర్ భ‌గ్రీ తొలిసారి లోక్‌స‌భ‌లో అడుగుపెట్ట‌నున్నారు. ట్రైబ‌ల్ సీటు దిందోరి నుంచి భ‌గ్రీ గెలుపొందారు. ఆయ‌న చేతిలో బీజేపీ లీడ‌ర్ భార‌తి ప‌వార్ ఓట‌మి చ‌విచూశారు. ముంబై నార్త్ నుంచి గెలుపొందిన పీయూష్ గోయ‌ల్, అమ‌రావ‌తి నుంచి విజ‌యం సాధించిన బ‌ల్వంత్ వాంఖ‌డే, అకోలా నుంచి గెలుపొందిన అనూప్ ధోత్రే, సంగ్లీ నుంచి విజ‌యం సాధించిన ఇండిపెండెంట్ అభ్య‌ర్థి విశాల్ పాటిల్ కూడా తొలిసారి పార్ల‌మెంట్‌లో పాదం మోప‌బోతున్నారు.

ఇక సినీ ప్ర‌ముఖులు సురేశ్ గోపీ(త్రిశూర్), కంగ‌నా ర‌నౌత్(మండి) నుంచి గెలుపొందారు. రాయ‌ల్ ఫ్యామిలీస్ నుంచి ఛ‌త్ర‌ప‌తి సాహు(కోల్హాపూర్), య‌ధువీర్ కృష్ణ‌ద‌త్త చామ‌రాజ వ‌డియార్(మైసూర్), కృతి దేవీ దెబ‌ర్మ‌న్( త్రిపుర ఈస్ట్) నుంచి తొలిసారి లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. క‌ల‌క‌త్తా హైకోర్టు మాజీ జ‌డ్జి అభిజిత్ గంగోపాధ్యాయ త‌ల్ముక్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారి గెలుపొందారు.

మాజీ సీఎంలు..

మాజీ సీఎంలు శివ‌రాజ్ సింగ్ చౌహాన్(మ‌ధ్య‌ప్ర‌దేశ్‌), నారాయ‌ణ్ రాణే(ర‌త్న‌గిరి – సింధుదుర్గ్‌), త్రివేండ్ర సింగ్ రావ‌త్‌(హ‌రిద్వార్‌), మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌(క‌ర్నాల్), బిప్ల‌వ్ కుమార్ దేవ్(త్రిపుర వెస్ట్‌), జిత‌న్ రాం మాంజీ(గ‌యా), బ‌స‌వ‌రాజ్ బొమ్మై(హ‌వేరి), జ‌గ‌దీశ్ షెట్టార్(బెల్గాం), చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చ‌న్నీ(జ‌లంధ‌ర్) తొలిసారి లోక్‌స‌భ‌లో అడుగుపెట్ట‌బోతున్నారు.

రాజ్యసభ సభ్యులు అనిల్ దేశాయ్ (శివసేన UBT), భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్, మన్సుఖ్ మాండవియా, పర్షోత్తమ్ రూపాలా కూడా లోక్‌సభలో తొలిసారిగా అడుగుపెట్ట‌బోతున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు