Sunday, December 29, 2024
HomeSportsIND vs PAK| లో స్కోరింగ్ గేమ్‌లో థ్రిల్లింగ్ విక్ట‌రీ.. టేబుల్ టాప్ చేరిన భార‌త్

IND vs PAK| లో స్కోరింగ్ గేమ్‌లో థ్రిల్లింగ్ విక్ట‌రీ.. టేబుల్ టాప్ చేరిన భార‌త్

IND vs PAK| మ‌రోసారి ఐసీసీ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌ని చిత్తు చేసింది భార‌త్. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీ చాలా రంజుగా సాగుతుండ‌గా, ఈ టోర్నీలో భాగంగా గ‌త రాత్రి పాకిస్తాన్-భార‌త్ మ‌ధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జ‌రిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టేబుల్ టాప్‌కి చేరుకుంది. మందకొడి పిచ్‌పై బ్యాటర్లు తడబడినా బౌలర్లు గొప్పగా రాణించడంతో భార‌త్‌కి మంచి విజ‌యం ద‌క్కింది. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల కార‌ణంగా మ్యాచ్ కాస్త ఆల‌స్యంగా మొద‌లైంది. భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేయ‌గా, 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (42; 31 బంతుల్లో, 6 ఫోర్లు) ఒక్క‌డే చెప్పుకోద‌గ్గ స్కోరు చేశాడు.

విరాట్ కోహ్లీ (4), రోహిత్ శర్మ (13), సూర్యకుమార్ యాదవ్ (7), శివమ్ దూబే (3) త్వరగా ఔటయ్యారు. హార్దిక్ పాండ్యా (7) ఎక్కువ సేపు నిలువకపోగా.. రవీంద్ర జడేజా (0) డకౌట్ అయ్యాడు. చివర్లో అర్షదీప్ సింగ్ (9), మహమ్మద్ సిరాజ్ (7 నాటౌట్) జ‌ట్టుకి విలువైన ప‌రుగులు అందించారు. ఇక పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా (3/21), హారిస్ రవూఫ్ (3/21) చెరో మూడు వికెట్లు, మహ్మద్ అమీర్ (2/23) రెండు వికెట్లతో సత్తాచాటారు. అయితే 120 ప‌రుగుల ల‌క్ష్యంతో పాకిస్తాన్ బ‌రిలోకి దిగింది. భారత బౌల‌ర్ల అద్వితీయ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో పాక్ జ‌ట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసి మ‌రో ఓట‌మిని త‌న ఖాతాలో వేసుకుంది.

బుమ్రా(3/14) మూడు, హార్దిక్ పాండ్య రెండు (2/24), అర్షదీప్ (1/31), అక్షర్ పటేల్ (1/11) చెరో వికెట్ తీశారు. పాక్ జ‌ట్టులో మహ్మద్ రిజ్వాన్ (31; 44 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) పోరాడాడు. చివరి ఓవర్లో పాక్‍కు 18 పరుగులు అవసరమయ్యాయి. అర్షదీప్ వేసిన ఆఖరి ఓవర్లో 11 పరుగులు ఇవ్వ‌డంతో .. 6 రన్స్ తేడాతో భారత్ గెలిచింది. చివరి ఓవర్ తొలి బంతికి ఇమాద్ వసీం (15)ను అర్షదీప్ ఔట్ చేయగా.. నాలుగు, ఐదు బంతులకు ఫోర్లతో నసీమ్ షా (10 నాటౌట్) కాస్త టెన్షన్ పెట్టాడు. అయితే, చివరి బంతిని అర్షదీప్ కట్టడి చేయ‌డంతో టీమిండియా విజయం సాధించింది. ఇక భార‌త త‌మ త‌దుప‌రి మ్యాచ్ జూన్ 12న అమెరికాతో భారత్ తలపడనుంది.

RELATED ARTICLES

తాజా వార్తలు