Wednesday, January 1, 2025
HomeTelanganaరుణ మాఫీ అమలుపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం

రుణ మాఫీ అమలుపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం

రుణమాఫీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ డేటాను ప్రాతిపదికగా తీసుకోవాలన్న నిర్ణయంపై ఒక ప్రకటనలో  మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులకు సాయంపై రంధ్రన్వేషణ చేస్తారా !

రుణమాఫీ అందరికీ వర్తింప చేయాలి .. ప్రభుత్వ ఆంక్షలు గర్హనీయం. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు సిగ్గుచేటు.

రైతులు ఎవరైనా రైతులే .. ఎన్నికల హామీ ప్రకారం రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేయాలి.

ఏడు నెలలు దాటినా ఇంకా కట్ ఆఫ్ డేట్ కూడా నిర్ణయించకపోవడం ఈ ప్రభుత్వ అసమర్ధత, నిర్లక్ష్యానికి నిదర్శనం.

దేశంలో తొలిసారి కేసీఆర్ రైతుబంధు పథకం అమలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి పెరిగి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది.

అదీ ఏడాదికి ఈ పథకం కింద మూడు విడతలలో ఇచ్చేది మొత్తంగా రూ.6 వేలు మాత్రమే .. దాని అమలుకు కూడా కేంద్రం సవాలక్ష ఆంక్షలు విధించింది

తెలంగాణలో 70 లక్షల మందికి పైగా రైతులు ఉండగా కేంద్ర ప్రభుత్వ కిసాన్ సమ్మాన్ నిధి గరిష్టంగా 36.1 లక్షల మంది రైతులకే అమలు చేశారు. కేంద్రం విధించిన అనేక నిబంధనల మూలంగా ప్రస్తుతం రాష్ట్రంలో కిసాన్ సమ్మాన్ నిధి రైతుల సంఖ్య 29 లక్షల 78 వేల 394 మంది కాగా ఇందులో 29 లక్షల 50 వేల 888 మంది ఖాతాలలో ఈ విడతలో నగదు జమయింది

ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు 70 లక్షల మంది రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎకరాకు రూ.5 వేలు, ఏడాదికి ఎకరాకు రూ.10 వేలు రైతుబంధు పథకాన్ని వర్తింపచేశారు

దేశ, ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 11 విడతల్లో రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.72,910 కోట్లు జమచేశారు

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రాతిపదికగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 70 లక్షల పైచిలుకు రైతాంగంలో సగానికి సగం మంది రైతులకు పథకాలను ఎగ్గొట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నది

మరి ఎన్నికల ప్రచార సమయంలోనే రైతుబంధు, రైతుభరోసా పథకాల అమలుకు నిబంధనలు వర్తింప చేస్తామని ఎందుకు చెప్పలేదు ?

ఎన్నికల సమయంలో రైతుబంధు తరహాలోనే రూ.10 వేలకు అదనంగా రూ.5 వేలు పెంచి ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున రైతుభరోసా ఇస్తామని రైతులను హామీ ఇచ్చారు.

అధికారం చేతికి వచ్చాక రైతుబంధు మాదిరిగానే గత యాసంగిలో ఎకరాకు రూ.5 వేలు అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

అధికారంలోకి వచ్చి ఏడునెలలు దాటినా ఇంకా విధి విధానాలు, మార్గదర్శకాలు అంటూ మరోసారి ఎకరాకు రూ.5 వేలు ఇస్తామని, తర్వాత రూ.2500 ఇస్తామని వాయిదాల పద్దతి మొదలు పెట్టారు. అది కూడా ఏ ప్రాతిపదికన ఇస్తారు ? ఎవరికి ఇస్తారు ? అన్న క్లారిటీ లేదు.

అదికారంలోకి రాగానే డిసెంబరు 9వ తేదీన రూ.15 వేలు రైతుభరోసా అన్నారు .. రూ.2 లక్షల రుణమాఫీ అన్నారు.

అబద్దపు హామీలతో అధికారం చేజిక్కించుకున్నాక గత ఏడు నెలలుగా హామీల ఎగవేతకు రంధ్రాన్వేషణ చేస్తున్నారు.

ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రుణమాఫీ, రైతుభరోసా అందరికీ అమలు చేయాలి.

ఏ మాత్రం వెనక్కి తగ్గినా రైతులను కలుపుకుని ఉద్యమిస్తాం.

వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. సాగునీళ్లు, కరంటు, పంటల కొనుగోళ్లలో రైతాంగాన్ని రాచిరంపాన పెడుతుంది.

అబద్దపు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి.

రేవంత్ పనితీరు పేరు గొప్ప .. ఊరు దిబ్బ  అన్నట్లు .. మీడియా ప్రచారం, వార్తల లీకేజీలు, ప్యాకేజీలు అన్నట్లు పాలన సాగుతుంది.

ఆడలేక మద్దెలోడు తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలలో కోతలు విధిస్తుంది అని అన్నారు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు