Wednesday, January 1, 2025
HomeTelanganaనీట్ నుంచి రాష్ట్రం బయటకు రావాలి : మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్

నీట్ నుంచి రాష్ట్రం బయటకు రావాలి : మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్

వైద్య క‌ళాశాల‌లో ప్ర‌వేశం కోసం దేశ వ్యాప్తంగా నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వ‌హించే NEET ప‌రీక్ష‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్, మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి తెలంగాణ భవన్ లో సోమ‌వారం ఏర్పాటు చేసిన ప‌త్రికా స‌మావేశంలో పాల్గొన్నారు.

దేశ వ్యాప్తంగా 24 లక్షల మంది నీట్ యూజీ రాశారు. నీట్ పీజీ నిన్న(జూన్ 23 న‌) జరగాల్సింది. కేవలం పది గంటల ముందు ఆ పరీక్ష ను వాయిదా వేసింది. దుబాయ్ నుంచి కూడ ఈ పరీక్ష రాసేందుకు వచ్చారు. చివరి నిమిషం లో నీట్ పీజీ పరీక్ష రద్దు చేయడం వల్ల ఎంతో మంది నష్ట పోయారు. నీట్ యూజీ పరీక్ష లో అవకతవకలు జరిగినప్పుడే నీట్ పీజీ పరీక్ష వాయిదా వేస్తే బాగుండేది అని బి. వినోద్ కుమార్ అభిప్రాయ ప‌డ్డారు.
నీటి యూజి లో అనేక అవకతవకలు జరిగాయి. స్వతంత్ర భారత్ లో ప్రవేశ పరీక్షల్లో జరిగిన అతి పెద్ద అవకతవకలు నీట్ యూజీ లోనే జరిగాయి. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లోనే నీట్ ప్రశ్నా పత్రాలు లీక్ అయ్యాయి. కోట్లాది రూపాయలు చేతులు మారాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గొర్రెల కొనుగోలు కుంభకోణంలో ఈడీ విచారణ జరపాలని బిజెపి ఎంపీ రఘునందన్ అన్నార‌ని, మరి నీట్ లో ఈడీ దర్యాప్తు అక్కర్లేదా? అని విమ‌ర్శించారు. చిన్న కేసులకు ఈడీని పంపే మోడీ నీట్ అవకతవకలపై ఎందుకు రంగములోకి దింపలేదు అని అన్నారు.
సుపరిపాలన అంటే ఇదేనా ? నీట్ లో ఈడీ దర్యాప్తు కోసం సుప్రీం ముందు వేసిన పిటిషన్ ఈరోజు విచారణకు వస్తోంది. బండి సంజయ్ గతంలో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజి జ‌రిగింద‌ని ఆరోపించార‌ని, ఒక్కో విద్యార్థికి లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని అపుడు బండి సంజయ్ డిమాండ్ చేశార‌ని, అదే విధంగా, నీట్ ప‌రీక్ష 24 లక్షల మంది రాశార‌నీ..వారందరికీ లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని బండి ఎందుకు డిమాండ్ చేయర‌ని ప్ర‌శ్నించారు. బండి సంజయ్ ఇపుడు ఎందుకు స్పందించడం లేద‌ని నిల‌దీశారు.
నీట్ నుంచి రాష్ట్రం బయటకు రావాల‌నీ, ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి మంచి న్యాయవాదిని సుప్రీం కోర్టులో నియమించి రాష్ట్రం తరపున వాదనలు వినిపించాల‌ని డిమాండ్ చేశారు.
రాష్టంలో ఎంసెట్ 60 ఏండ్లుగా బాగా జరిగింద‌నీ, అదే పద్ధతి మళ్ళీ రావాల‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.
ఇప్పటి దాకా నీట్ ఎన్నిసార్లు లీక్ అయ్యిందో అనే అనుమానాలు వస్తున్నాయ‌ని, మన విద్యార్థులు నీట్ తో న‌ష్ట‌పోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అన్ని పరీక్షలనూ కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకోవడం ఫెడరలిజంను మంట గలపడమేన‌నీ, పదో తరగతికి ఇంటర్ మీడియట్ కు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సిలబస్ ఉంద‌నీ, జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష తో అన్ని రాష్ట్రాల వారికి ఎలా న్యాయం జరుగుతుంద‌ని ప్ర‌శ్నించారు. పార్లమెంటు ఈ రోజే కొలువు తీరింద‌నీ, ఈ సంద‌ర్భంగా విద్యార్థులకు న్యాయం చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

తాజా వార్తలు