Saturday, January 4, 2025
HomeTelanganaజాతీయ ఆరోగ్య మిష‌న్ నిధుల‌ను విడుద‌ల చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

జాతీయ ఆరోగ్య మిష‌న్ నిధుల‌ను విడుద‌ల చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. న‌డ్డాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

జాతీయ ఆరోగ్య మిష‌న్ (ఎన్‌హెచ్ఎం) కింద తెలంగాణ‌కు రావ‌ల్సిన బ‌కాయిలు రూ.693.13 కోట్లు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. న‌డ్డాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా జె.పి. నడ్డాను కలిసి వైద్యా ఆరోగ్య రంగంపై తెలంగాణ ప్ర‌భుత్వం పెడుతున్న ప్ర‌త్యేక చర్యలను వివ‌రించారు.

ఆరోగ్య మిషన్ 2023-24 మూడు, నాలుగు త్రైమాసికాల నిధులు రూ.323.73 కోట్లు పెండింగ్‌లో ఉండటమే కాకుండా 2024-25 మొద‌టి త్రైమాసిక గ్రాంట్ రూ.138 కోట్లు కూడా మంజూరు చేయాల్సి ఉంద‌ని తెలియజేస్తూ, ఆ మొత్తాన్ని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కోరారు.

ఆయుష్మాన్ భార‌త్ నిబంధ‌న‌లు అన్నింటిని తాము ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి అమ‌లు చేస్తున్న‌ట్లు కేంద్ర మంత్రికి వివరించారు. ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకుగానూ 5,159 బ‌స్తీ ద‌వాఖానాలు (ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు) స‌మ‌ర్థంగా నిర్వ‌హిస్తున్నట్టు తెలిపారు.

జాతీయ ఆరోగ్య మిష‌న్ కింద చేప‌ట్టిన మౌలిక వ‌స‌తులు, నిర్వ‌హ‌ణ కాంపోనెంట్ కింద 2023-2024 సంవ‌త్స‌రానికి సంబంధించి రావ‌ల్సిన రూ.231.40 కోట్ల నిధులను కూడా త‌క్ష‌ణ‌మే రీయింబ‌ర్స్ చేయాల‌ని ముఖ్యమంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ నిధుల విడుదలలో జాప్యం కావ‌డంతో అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌కుండా, సిబ్బందికి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతో పాటు కేంద్రం వాటా మొత్తాన్ని కూడా అక్టోబర్ 2023 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే విడుద‌ల చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

RELATED ARTICLES

తాజా వార్తలు