వాషింగ్టన్: ఆయన అగ్రరాజ్యానికి అధ్యక్షుడు. ఒకానొక సందర్భంలో ఆత్మహత్య (Suicide) చేసుకోవాలని అనుకున్నాడట. ఇందేటి ప్రపంచ పెద్దన్నకు పెద్దదిక్కుగా ఉన్న అతని బలవన్మరణం చేసుకోవాలన్న ఆలోచన ఎందుకొచ్చిందని అనుకుంటున్నారా.. ఇప్పుడు కాదు లేండి. ఎప్పుడో 50 ఏండ్ల కింద.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష ఎన్నికలతోపాటు తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలను పంచుకున్నారు. ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని, ఆ పరిస్థితికి గల కారణాలను వెల్లడించారు.
1972లో జరిగిన కారు ప్రమాదంలో తన మొదటి భార్య, కుమార్తె మరణించారని, దీంతో తాను మానసికంగా కుంగిపోయానని చెప్పారు. అప్పుడు మద్యానికి అలవాటుపడ్డానని, బ్రిడ్జి మీదకు వెళ్లి దానిపైనుంచి దూకాలనే ఆలోచనలు వచ్చేవన్నారు. కానీ వెంటనే తన ఇద్దరు కుమారులు గుర్తొచ్చేవారని తెలిపారు. ఆ తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఆత్మహత్య వంటి పిచ్చి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదని వెల్లడించారు. కొద్దికాలానికి జిల్‌తో పరిచయం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. 1975లో తామిద్దరం మొదటిసారి కలిసామని చెప్పారు. అప్పుడు తన వయసు 33 సంవత్సరాలని, సెనేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాని తెలిపారు. మరో రెండేండ్ల తర్వాత పెండ్లి చేసుకున్నామన్నారు.