* సైనిక స్కూళ్ల మాదిరే పోలీసు పిల్లలకు ప్రత్యేక స్కూల్స్
* రాజకీయ నిఘా కన్నా నేరాల నియంత్రణకే ప్రాధాన్యం ఇవ్వాలి
* హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడాలి..
* పోలీసు అధికారులతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
CM : సరిహద్దులో సైన్యంలా రాష్ట్రంలోకి డ్రగ్స్ రాకుండా పోలీసు పహారా ఉండాలి
హైదరాబాద్: ఒకప్పుడు గుడుంబా పెద్ద సమస్యని, ఇప్పుడు అది లేదని, ప్రస్తుతం పల్లె, పట్టణం తేడా లేకుండా డ్రగ్స్ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎంత సంపాదించినా మన పిల్లలు బాగుండాలని కోరుకుంటామని, ఆ పిల్లలే డ్రగ్స్ బారిన పడితే ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) నుంచి గంజాయి వస్తోందనే సమాచారం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. చొరబాట్లు, ఇతర సమస్యలు రాకుండా దేశ సరిహద్దుల్లో సైన్యం ఎలా అప్రమత్తంగా ఉంటుందో, పహారా కాస్తుందో, అలాగే రాష్ట్ర సరిహద్దుల్లోనూ పోలీసులు అలా అప్రమత్తంగా ఉండి, పహారా కాసి తెలంగాణలోకి గంజాయి మొక్క, డ్రగ్స్ రాకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని ఇన్‌స్పెక్టర్లు, ఆపై స్థాయి అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు శాఖలో సీబీసీఐడీ, ఏసీబీ, గ్రేహౌండ్స్, అక్టోపస్ వంటి విభాగాలు ఏర్పాటు చేశారని, ప్రస్తుతం సైబర్ నేరాలు, డ్రగ్స్ సమాజాన్ని పట్టి పీడిస్తున్నందున సైబర్ సెక్యూరిటీ బ్యూరో, యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఏర్పాటయ్యాయన్నారు. డ్రగ్స్, సైబర్ నేరాలు పట్టిపీడిస్తున్నందున వాటిని అరికట్టేందుకు అవసరమైన సామర్థ్యాలను అందిపుచ్చుకోవాలని పోలీసులకు ముఖ్యమంత్రి సూచించారు. ఐపీసీ, సీఆర్‌పీసీల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తెచ్చినందున వాటిపైనా పూర్తి అవగాహన తెచ్చుకోవాలని, అందుకు అవసరమైన శిక్షణ తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అలా శిక్షణ పొందినప్పుడే సమాజం నుంచి నూతనంగా ఏర్పాటయ్యే సవాళ్లను ఎదుర్కొవచ్చని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.. దేశంలో ఎక్కడ తీవ్రవాద, ఉగ్రవాద కదలికలు, అరెస్టులు అయినా, బాంబు పేలుళ్లు జరిగినా అదనపు సమాచారం కోసం కేంద్ర హోం శాఖ నుంచి ఆయా రాష్ట్రాల పోలీసులు తెలంగాణ ఎస్ఐబీ సహకారం కోరతారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. మన రాష్ట్ర పోలీసు, హైదరాబాద్ పోలీసుపై అందరికీ నమ్మకం ఉందని, నేరగాళ్ల ఆలోచనను, వాళ్లు వేసే ఎత్తుగడలను ముందే గుర్తించి ఆ నేరాలను అరికట్టే ప్రణాళిక రచించి, అందుకు అవసరమయ్యే శిక్షణ పొందుతున్నందునే తెలంగాణ పోలీసుకు జాతీయ స్థాయి గుర్తింపు ఉందని ముఖ్యమంత్రి అన్నారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌తో మన ఉత్పత్తులు విదేశాలకు, విదేశీ ఉత్పత్తులు మన దేశానికి వస్తున్నట్లే, నేరగాళ్లు సైతం విదేశాల నుంచే ఇక్కడ నేరాలకు పాల్పడుతున్నారని, వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. పోరాటాలతో ఏర్పడిన తెలంగాణలో పదేళ్లలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో గంజాయి వంటి మాదకద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. సింగరేణి కాలనీలో ఒక బాధితుని కుటుంబాన్ని, ఔటర్ రింగు రోడ్డులో ఒక బాధితుడైన డాక్టర్‌ను పరామర్శించడానికి వెళితే వారంతా గంజాయికు అలవాటైన వారి వలనే తాము బాధితులుగా మరినట్లు తెలిపారన్నారు. తమ పిల్లలు కార్పొరేట్ స్కూళ్లకు వెళుతున్నారని, తాము రూ.వందల కోట్లు సంపాదించినా ఉపయోగం లేకుండాపోయిందని, తమ పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని పలువురు తల్లిదండ్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం పోలీసు వ్యవస్థ రాజకీయ నిఘాపై శ్రద్ధ పెట్టి నేరగాళ్లను వదిలివేయడమేనని ముఖ్యమంత్రి అన్నారు.
RELATED ARTICLES