Friday, January 3, 2025
HomeAndhra PradeshAP News: క్షుద్ర పూజల భయంతో గ్రామస్థులు జాగారం

AP News: క్షుద్ర పూజల భయంతో గ్రామస్థులు జాగారం

తలుపులు, చెట్లకు నిమ్మకాయలు..

భయంతో 15 రోజులుగా జాగారం ఉంటున్న గ్రామస్తులు

AP News: ఊరిలో తలుపులు, చెట్లకు మంత్రించిన నిమ్మకాయలు.. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వెదజల్లిన డబ్బులు, అన్నం.. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే పల్నాడు జిల్లా చిన్నతురకపాలెం ఊళ్లో కనిపిస్తున్న దృశ్యమిదీ! అసలేం జరుగుతోంది? ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలియక ఆ గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. ఊరిలో చేతబడి జరుగుతోందని భయంతో జనం వణికిపోతున్నారు. రాత్రయ్యిందంటే చాలు.. నిద్రపోకుండా జాగారం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం చిన్నతురకపాలెంలో 15 రోజుల క్రితం ఓ వ్యక్తి ఇంటి ముందు గోడకు మేకులు కొట్టి కనిపించాయి. ఆ తర్వాత రోజు చెట్టుకు అలాగే మేకులు కనిపించాయి. మొదట వీటిని గ్రామస్తులు పెద్దగా పట్టించుకోలేదు. ఎవరో ఆకతాయిలు చేసి ఉంటారని లైట్‌ తీసుకున్నారు. కానీ అప్పటి నుంచి ప్రతిరోజూ ఇదే తంతు జరుగుతోంది. మొదట్లో మేకులు మాత్రమే కనిపించగా.. ఇప్పుడు నిమ్మకాయలు, పసుపు-కుంకుమ కూడా కనిపిస్తున్నాయి. రాత్రయితే చాలు ఎవరో నిమ్మకాయలు పెట్టడంతో పాటు రోడ్లపై డబ్బులు, అన్నం వెదజల్లి వెళ్తున్నారు. దీంతో ఊరిలో ఎవరో చేతబడి చేస్తున్నారని జనాల్లో అనుమానం మొదలయ్యింది. అప్పట్నుంచి అందరిలోనూ ఒకటే ఆందోళన. రాత్రయ్యిందంటే చాలు నిద్ర పట్టడం లేదు.. పొద్దున లేవగానే ఏ ఘోరం చూడాల్సి వస్తుందోనని భయపడిపోతున్నారు. దీంతో రోజూ తెల్లవారగానే తమ గోడలను చెక్‌ చేయించుకుంటున్నారు.

క్షుద్ర పూజల భయంతో గ్రామస్థులు నిద్రపోవడం కూడా మానేసి జాగారం చేస్తున్నారు. అర్ధరాత్రులు కర్రలతో కాపలా కాస్తున్నారు. రాత్రిళ్లు ఇతరులు ఎవరూ తమ గల్లీల్లోకి రాకుండా ముళ్ల కంచెలతో బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు. కాగా, 15 రోజులుగా చేతబడి ఆనవాళ్లు కనిపించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు