Friday, January 3, 2025
HomeTelanganaCongress Govt | పరిహారం లేదు.. పరామర్శా లేదు..

Congress Govt | పరిహారం లేదు.. పరామర్శా లేదు..

ప్రభాకర్‌ రైతు కుటుంబానికి ఏదీ సర్కారు భరోసా?

 

సెల్ఫీవీడియో తీసుకుంటూ పురుగులమందు తాగిన ఖమ్మం రైతు బోజడ్ల ప్రభాకర్‌ కుటుంబం.. వారంరోజులుగా న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నది. విచారణకు వచ్చిన ఎమ్మార్వో కాళ్లపై పడి పిల్లలు ఏడ్వటం అందరినీ కదిలించింది.
  • కనీస ఓదార్పునకూ ముందుకురాని రాష్ట్ర ప్రభుత్వం
  • న్యాయం చేయాలని అర్థిస్తున్న బాధిత కుటుంబం
  • విచారణకు వచ్చిన ఎమ్మార్వో కాళ్లుపట్టుకున్న పిల్లలు
  • కలెక్టర్‌కు గోడు వెళ్లబోసుకున్న తండ్రి వీరభద్రయ్య
  • పలకరింపునకూ తీరిక లేని ఖమ్మం మంత్రులు
  • ఫిరాయింపు ఎమ్మెల్యేల చేరికల్లో ఎవరికివారు బిజీ
  • దగ్గర్లోనే మంత్రి ఫాంహౌస్‌.. అయినా తొంగిచూడలే!
  • రైతు కుటుంబానికి నేడు బీఆర్‌ఎస్‌ నేతల పరామర్శ

సెల్ఫీవీడియో తీసుకుంటూ పురుగులమందు తాగిన ఖమ్మం రైతు బోజడ్ల ప్రభాకర్‌ కుటుంబం.. వారంరోజులుగా న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నది. విచారణకు వచ్చిన ఎమ్మార్వో కాళ్లపై పడి పిల్లలు ఏడ్వటం అందరినీ కదిలించింది. కానీ కాంగ్రెస్‌ సర్కారులో మాత్రం కదలిక లేదు. ఖమ్మం మంత్రులకు తీరిక లేదు. పరిహారం ఇవ్వకపోగా, పరామర్శించిన నాథుడే లేడు. విచారణలో పురోగతే లేదు. సర్కారు నుంచి కనీస స్పందన కొరవడిన నేపథ్యంలో తమ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభాకర్‌ తండ్రి భద్రయ్య కనిపించినవారినల్లా చేతులు జోడించి అర్థిస్తున్నాడు.

కాళ్లు పట్టుకున్నా కనికరం లేదు

కుమారుడి మృతితో కష్టాల్లో కూరుకుపోయిన కుటుంబం వెతలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. దివ్యాంగుడైన ఆయన తండ్రి వీరభద్రయ్య న్యాయం కోసం జోలెపట్టి మరీ వేడుకున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ప్రభాకర్‌ పిల్లలు విచారణకు వచ్చిన చింతకాని తహసీల్దార్‌ కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని వేడుకోవడం చూసిన వారి హృదయాలను ద్రవింపజేసినా ప్రభుత్వంలో మాత్రం చలనం లేకపోవడం ఆశ్చర్యపరుస్తున్నది. కలెక్టర్‌ను వేడుకున్నా ముందడుగు పడలేదు. ప్రభాకర్‌ మరణించి వారం రోజులు గడుస్తున్నా కేసు విచారణలో ఎలాంటి పురోగతీ లేదు. ఆయన ఆత్మహత్యకు కారకులెవరన్న విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నా పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదని వీరభద్రయ్య వాపోతున్నాడు. తమ భూమికి సంబంధించి అధికారులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు పరామర్శిస్తున్నా ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టు కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఐదు కిలోమీటర్ల దూరంలోనే మంత్రి ఫామ్‌హౌస్‌

రైతు ప్రభాకర్‌ చనిపోయి వారం రోజులు అవుతున్నా సొంత జిల్లా మంత్రుల్లో ఒక్కరు కూడా పరామర్శకు రాకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ కేసు విచారణలో వేగం లేదు సరికదా, బాధిత కుటుంబాన్ని పరామర్శించే తీరిక కూడా లేకపోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా దారుణం ఏంటంటే.. ప్రభాకర్‌ గ్రామం ప్రొద్దుటూరుకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఓ మంత్రి ఫాంహౌస్‌ ఉంది. మంత్రికి అక్కడికి వచ్చే సమయం ఉన్నా, పుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రభాకర్‌ కుటుంబాన్ని పరామర్శించి, అండగా ఉంటామన్న భరోసా ఇచ్చేందుకు సమయం లేకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలోనూ రాజకీయం చూపడం తగదని హితవు పలుకుతున్నారు. ఈ కేసు విషయంలో లోతుగా దర్యాప్తు జరపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించినా ఫలితం లేకపోయింది.

కుటుంబాన్ని ఆదుకునేదెవరు?

ప్రభాకర్‌కు తల్లిదండ్రులు, భార్య, కుమార్తె, కొడుకు ఉన్నారు. పిల్లలిద్దరూ పదో తరగతిలోపే చదువుతున్నారు. కొడుకు మృతితో ఆగమైన కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు సరికదా, కనీసం పరామర్శించి భరోసా ఇవ్వకపోవడం ఆ కుటుంబాన్ని వేధిస్తున్నది. అంధకారంలోకి వెళ్లిన పిల్లల భవిష్యత్తును తలచుకుని ప్రభాకర్‌ భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నది. ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు నేతృత్వంలో రెండ్రోజుల క్రితం ప్రభాకర్‌ భార్య, కుటుంబ సభ్యులు కలెక్టర్‌ను కలిసి ప్రభాకర్‌ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను వివరించారు. అతడి మృతితో కుటుంబం అనాథగా మారిందని, వృద్ధుడినైన తాను దివ్యాంగుడినని, దిక్కులేని కుటుంబాన్ని ఆదుకోవాలని వీరభద్రయ్య మొరపెట్టుకున్నాడు.

రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

ప్రభాకర్‌ కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తున్నది. బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వడంతోపాటు ప్రభాకర్‌ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ప్రభాకర్‌ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభాకర్‌ జీవించి ఉన్నప్పుడు భూ అంశాల్లో ఇబ్బందిపెట్టిన వారే ఇంకా తమను సాధిస్తున్నారన్న అనుమానాన్ని ఆయన తండ్రి వీరభద్రయ్య వ్యక్తం చేశారు.

నేడు బీఆర్‌ఎస్‌ నేతల పరామర్శ

ప్రభాకర్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్‌ఎస్‌ నేతల బృందం ఆదివారం ప్రొద్దుటూరులో పర్యటించనున్నది. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, సత్యవతి రాథో డ్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు తదితరులతో కూడిన బృందం ఉదయం 9 గంటలకు బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తుంది. ప్రభాకర్‌ ఆత్మహత్యకు గల కారణాని తెలుసుకున్న అనంతరం ఆక్రమణకు గురైన భూమిని పరిశీలిస్తారు. తర్వాత ఖమ్మంలో సీపీ సునీల్‌దత్‌ను కలిసి ప్రభాకర్‌ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పిస్తారు.

RELATED ARTICLES

తాజా వార్తలు