SSC Results | రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల (SSC Results) వెలువడ్డాయి. హైదరాబాద్‌లోని పాఠశాల విద్య భవన్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 91.31 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 93.23 శాతం మంది బాలికలు ఉండగా, 89.42 శాతం బాలురు పాసయ్యారు.
అయితే రాష్ట్రంలోని 6 పాఠశాలల్లో విద్యార్థులంతా ఫెయిల్ అయ్యారు. వాటిలో 4 ప్రైవేట్ స్కూళ్లు, 2 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా 3,927 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదయింది. వీటిలో 1347 జెడ్‌పీహెచ్ స్కూళ్లు ఉంన్నాయి. జిల్లాల వారీగా చూస్తే 99.05 శాతంతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా, 65.10 శాతంతో వికారాబాద్ చివరి స్థానంలో నిలిచింది. 8,883 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు.
జూన్ 3 నుంచి సప్లిమెంటరీ
జూన్ 3 నుంచి 14 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మే 16 నుంచి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రీకౌంటింగ్ 15 రోజుల వరకు అవకాశం కల్పించారు. ప్రతి సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించాలి. ఆన్సర్‌షీట్ ఫొటో కాపీ కోసం సబ్జెక్టుకు రూ.1000, రీవెరిఫికేషన్‌కు రూ.1000 చెల్సించాల్సి ఉంటుంది.