Friday, January 3, 2025
HomeTelanganaకత్తిరింపే..? హైడ్రాకు పూర్తి అధికారాలు..

కత్తిరింపే..? హైడ్రాకు పూర్తి అధికారాలు..

Click to view జనపదం – గురువారం -15-08-2024 E-paper

Click to view జనపదం -14-08-2024 E-paper

కత్తిరింపే..?

హైడ్రా (HYDRA) కు పూర్తి అధికారాలు..
టార్గెట్ గులాబీ మాజీలా….?
ఫస్ట్ వికెట్ దానం..
తర్వాత మల్లారెడ్డి అండ్ టీం మేట్స్..
జాబితా అంతా గులాబీలో ‘అతి’దారులదే..
‘ఏవీ’ వ‌ద‌ల‌ని రంగనాథ్..
వరంగల్ లోనూ తన మార్కు పనితీరు..
తట్టుకోలేకే రంగనాథ్ కు దానం వార్నింగ్
సీఎం దగ్గరే తేల్చుకుంటానని వ్యాఖ్య..
హైడ్రాతో నగర స్థితిగతులు మెరుగు..

కొట్టక తిట్టక వట్టలొలుసుడు.., మట్టి అంటుకోకుండా పని పూర్తి చేయడం అంటే ఇదేనేమో. పడేయాలంటే పట్టుకోవాల్సిన అవసరం లేదు., బలియ్యాలంటే బంధీగా చూపాల్సిన అక్కర అంతకన్నా లేదు. సమయం, సందర్భం కుదిరితే అన్నీ వాటంతట అవే జరుగుతాయి. అంతేగానీ ‘నేను లోకల్., అలాంటోళ్లు వస్తుంటారు.., పోతుంటారు..,’ అనే సినిమా డైలాగులతో ఏదో చేయాలనుకోవచ్చేమోగానీ, అతడు రంగంలోకి దిగితే ‘ఇన్ని రోజులు ఒక లెక్కా.., ఇప్పటి నుంచి ఇంకో లెక్క..’ అనే బాపతే. పని తప్ప మరేమి పట్టని ఆయన రంగంలోకి దిగాడో స్వయంగా పంపించిన పెద్దలు చెప్పినా వినని మొండిఘటం.

===========================

చెరబట్టిన వారి ముగింపు ఆసన్నమైనట్టే. ఆక్రమించిన వారు అన్నీ వదిలేసి పారిపోవాల్సిందే. ‘హైడ్రా’ రూపకల్పనతో భూమి సంబురపడుతుంటే, తమ అంతే చూడడానికి ఏర్పాటు చేశారని ఆ తరహా వాళ్లు హైరానాపడుతున్నారు. ఎక్కడ విధుల్లో ఉన్నా తనమార్కు పనితనంతో సామాన్యుడికి బాసటగా నిలిచే స్వభావమున్న అధికారిగా పేరున్న ఆయన పర్యవేక్షణలో కొలువుదీరిన కొత్త కార్యాలయం ఇప్పుడు ఆబాపతుగాళ్లకు ఓ హడల్. ఆక్రమించింది ఆ పక్షమా., ఈ పక్షమా.. అనే తేడాలు చూడకుండా అన్యాయమా.., అక్రమమా.., అనేది మాత్రమే చూస్తూ ఫాస్ట్ జస్టిస్ అనేలా వ్యవహరించే అధికారి కావడంతో అలాంటి వాళ్లందరికీ ఆయనంటే భయం. బాధితులంతా దేవుడని కొలుచుకునే ఏవీ రంగనాథ్ ను ఇప్పుడు హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) చీఫ్ గా రాష్ట్ర సర్కార్ నియమించడంతో కబ్జాలతో పూడుకుపోయిన భాగ్యనగరం పులకిస్తుంటే, నీళ్లల్లో పేకమేడలు కట్టిన వాళ్లు వణికిపోతున్నారు.

========================

టార్గెట్ గులాబీ మాజీలా….?
అధికారం ఉందని కన్నూమిన్ను కానకుండా వ్యవహరించిన గులాబీ నేతలే టార్గెట్ గా హస్తం సర్కార్ ప్రణాళికలు రూపొందించినట్టు సమాచారం. అధికారం పోగానే పాపాల నుంచి కాపాడుకోవడానికి వలసొచ్చిన గులాబీలే కాదు, రాజధాని చెరువులను బతకనివ్వకుండా చంపేస్తున్న వారెవరైనా వదిలేది లేదనే సంకేతాలిచ్చేలా హైడ్రాకు రూపకల్పన చేసింది. ఆ పదేళ్లు కేసీఆర్ అండలుండగా తమకేలా అడ్డూఅదుపు అన్నట్టుగా వ్యవహరించిన వారంతా ఇప్పుడు దోషులుగా మారాల్సిందే. ప్రజల సొమ్మును ఫలహారంగా భోంచేసి, అప్పటి ప్రతిపక్షాలను, అడిగిన జనాలను ముప్పుతిప్పలు పెట్టిన వారు అనుభవించాల్సిందే. ఇన్నాళ్లకు కాంగ్రెస్ కు అవకాశం వచ్చింది. రాజధానిలోని వందల చెరువులు ఎలా కుచించుకుపోయాయో తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని భావించి గొప్ప చర్చకు శ్రీకారం చుట్టింది. డైనమిక్ ఐపీఎస్ అధికారికి బాధ్యతలు అప్పగిస్తే జరగాల్సిన కార్యం అదే జరుగుతుందని సీఎం సైలెంట్ గా సంకేతాలు ఇచ్చారు. గులాబీలోని ఆక్రమణ దారులు, చెరువు శిఖాలు, ఎఫ్ టీఎల్ లను వదలని వారు, నీరు నిలవాల్సిన చోట అద్దెల మేడలు నిర్మాణాలు చేసిన వారు ఇప్పుడు దోషులుగా మారాల్సిన తరుణం ఆసన్నమైంది.

====================

హైడ్రా కు పూర్తి అధికారాలు..
హైడ్రాకు అవసరమైన ఆఫీసర్లు, సిబ్బంది ను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు మంగళవారం 259 మంది ఆఫీసర్లు, సిబ్బంది ని కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అందులో ఒక ఐపీఎస్, ముగ్గురు గ్రూప్ వన్ స్థాయి ఎస్పీలు, ఐదుగురు డిప్యూటీ స్థాయి సూపరింటెండెంట్లు, 21 మంది ఇన్ స్పెక్టర్లు, 33 సబ్ ఇన్ స్పెక్టర్లు, ఐదుగురు రిజర్వ్ ఇన్ స్పెక్టర్లు, 12 మంది రిజర్వు ఎస్సైలు, 101 మంది కానిస్టేబుళ్లు, 72 మంది హోంగార్డులు, ఆరుగురు అనలిటికల్ ఆఫీసర్లు ఉంటారని పేర్కొంటూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ ఉత్తర్వులు విడుదల చేశారు.

ఫస్ట్ వికెట్ దానం..
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నం 69 నందగిరిహిల్స్ లో జీహెచ్ఎంసీకి చెందిన ప్రభుత్వ స్థలం ప్రహరీ కూల్చివేతకు సంబంధించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ భూముల రక్షణకు చేసిన కట్టడాన్ని ఇష్టారీతిగా పడగొట్టిన ఎమ్మెల్యే ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి. ఎటు మొగ్గుంటే అటు, ఏ రంగు మంచిగనిపిస్తే అటు వెళ్తాడని స్వయంగా అనుచరులే పేర్కొనే దానం ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నా సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన దుస్థితి. తప్పు ఎవరు చేసినా వదిలేది లేదని హెచ్చరించిన ఏవీ రంగనాథ్ నాగేందర్ ను మాత్రం ఎందుకు విడుస్తాడని అంతా అనుకుంటున్నారు. హైడ్రాలో మొట్టమొదటి వికెట్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే రూపంలోనే చిక్కే చాయలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానం తర్వాత మాజీ మంత్రి మల్లారెడ్డి అండ్ టీం మేట్స్ హైడ్రా కోరల్లో చిక్కుకునే అవకాశాలున్నాయి. మల్లారెడ్డి తన విద్యాసంస్థల నిర్మాణాలను ఆక్రమించిన భూములు, కబ్జా చేసిన స్థలాల్లోనే చేశారని ఇప్పటికే సంబంధిత శాఖలు తేల్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్త అధికారాలతో రంగప్రవేశం చేసిన హైడ్రా.. వాటిని పునాదులతో సహా పెకిలించేందుకు ఎందుకు వెనకాడుతుంది మరి. అంటే ఒక్కొక్కరుగా కట్టుకున్న చెరువు మట్టిల్లోని మహా కట్టడాలు నేలమట్టమవడానికి సమయం సమీపిస్తున్న చాయలు సుస్ఫష్టం.

ఇప్పటికే ఏవీ రంగనాథ్ దగ్గర కబ్జా దారుల చిట్టీ మొత్తంగా ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా పేట్రేగిపోయిన వారంతా ఇప్పుడు వలలో చిక్కుకుని విలవిలాడే సమయం రానే వచ్చింది. అందునా తెలంగాణ తొలి రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న గులాబీలే అధికంగా ఉన్నారు. హైడ్రాతో చెరువులకు పూర్వపు కళ తీసుకువచ్చే పనిలో భాగంగా ఆ కారు పార్టీ అతిగాళ్ల భరతం తప్పకుండా పట్టే తరుణం ఆసన్నమైనట్టు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలుస్తోంది.

వరంగల్ లోనూ తన మార్కు పనితీరు..
ఏవీ రంగనాథ్ అంటే ఏంటో వరంగల్ ప్రజలను అడిగితే ఇట్టే చెప్పుతారు. సీపీగా అక్కడ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కబ్జాదారులు కంటికి కనిపించకుండా పోయారంటే అతిశయోక్తి కాదు. అధికార పార్టీ కార్పొరేటర్లను సైతం వదలకుండా కటకటలాకు పంపించిన ధైర్యం అక్కడి ప్రజలు ఎప్పటికి మర్చిపోరు. ప్రభుత్వ చీఫ్ విప్ కు అత్యంత అంతరంగీకుడిని సైతం వదలకుండా జైలుకు పంపించి తానేంటో నిరూపించుకున్నారు. ఆయన పనితీరుతో ఎందరో బాధితులు న్యాయం పొంది ఊపిరి పీల్చుకున్నారు. ఆయనకు ధన్యవాదాలుగా పాలాభిషేకాలు చేశారంటే ఆయన పనితీరు ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు దానం నాగేందర్ పై కూడా కేసు నమోదు కావడంతో హైదరాబాద్ కూడా ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీ నేతనే వదల్లేదంటే ఇక ఎవరైనా అంతే అనే సంకేతాలు లీడర్లలో పంపించారు. రంగనాథ్ పనితీరుకు నొచ్చుకుని దానం మాత్రం సినీ డైలాగులతో స్వీటుస్వీటుగానే ఘాటు వార్నింగ్ ఇచ్చాడనే టాక్ కూడా వినవస్తోంది. తన విషయాన్ని సీఎం రేవంత్ దగ్గరే తేల్చుకుంటానని భీష్మించుకున్నారు. ఏదిఏమైనా హైడ్రాతో నగర దుస్థితికి చరమగీతం పాడి చెరబడిన చెరువులు సంకెళ్లు తెంచుకుని ఊపిరి పీల్చుకుంటాయని ప్రజలు మాత్రం హర్షిస్తున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు