Wednesday, January 1, 2025
HomeTelanganaఓన్ టీంకు వేళాయె.? 20న మంత్రి వర్గ విస్తరణ

ఓన్ టీంకు వేళాయె.? 20న మంత్రి వర్గ విస్తరణ

Click to view జనపదం – గురువారం -15-08-2024 E-Paper

ఓన్ టీంకు వేళాయె.?

20న మంత్రి వర్గ విస్తరణ..
సొంతవారికి సీఎం ప్రాధాన్యం..!
సీనియర్లకు చెక్ పెట్టే యత్నాలు..?
17 లేదా 18న ఢిల్లీకి..
పక్కా ప్రణాళికతో ప్రయాణం..
నామినేటెడ్ పదవుల్లోనూ తన వారికి దక్కేలా వ్యూహాలు..
కేటాయింపు పూర్తి.. ప్రకటనే తర్వాయా..?
ఆశావహుల చూపంతా ఆ రోజు కోసమే..

కొత్తపాతల కలయిక పాతదైపోయింది. సీనియర్, జూనియర్ అనే తేడాలు సన్నబడిపోయాయి. అయినా.., నడక నేర్వడం వరకే సాయంగానీ, పరుగు అందుకున్నాక వెనుదిరిగి చూడాల్సిన అవసరమేముంటది. ఎప్పుడూ ఒకేదారిలో వెళ్తే ఎక్కువ కాలం మెప్పించడం కష్టం కాబట్టే మార్గం మార్చాలి., నడిచే విధానంలో తేడాను తెలియజెప్పాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ కూడా నయా పోకడలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎంతటి బలశాలియైనా తన బలం ఇంకా పెంచుకోవడానికే మొగ్గుచూపినట్టుగా, సీఎం కూడా తన అనుచరగణాన్ని కేబినెట్ లో ఇరికియ్యడానికి పావులు కదుపుతున్నట్టు వినికిడి. టీపీసీసీగా బాధ్యతలు స్వీకరించిన నుంచి సీనియర్ల నుంచి తిరస్కరణలు, అవమానాలు ఎదుర్కుంటూ సాగుతున్న యాత్రలో ఇన్నాళ్లకు పాలనపై తనకో స్పష్టత రానైతే వచ్చింది. దీంతో ‘‘ఎవరేమీ అనుకున్నా నువ్వెళ్లే రాజ్యానా..’’ అన్నట్టుగా మంత్రి వర్గ విస్తరణలో తన మార్కుతో కూడిన మార్పునకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. అందరు ఉన్న ఒంటరి వాడిగా చూసిన తన గతాన్ని నెమరేసుకుంటూ, మరీ ముఖ్యంగా తనకు కుర్చీ దక్కినప్పటి నుంచి నోరు పారేసుకున్న వారంది ఆటలు కట్టిస్తూనే నిజమైన పాలన కోసమే తాను…. అనే సంకేతాలు ఇవ్వడానికి నయా గేమ్ కు రిబ్బన్ కట్ చేయబోతున్నాడు.
==============================

ఎంతటి వారికైనా సొంతవారు అనే ఫీలింగ్ తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర సీఎం విషయంలో కూడా అదే నిజం కాబోతున్నట్టుగా అనిపిస్తోంది. మంత్రి వర్గ విస్తరణకు కసరత్తు మొదలైన వేళ తన అనుచరులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైనట్టుగానే పావులు కదుపుతున్నట్టు సమాచారం. అధినేత సోనియా, రాహుల్ ఎంతో నమ్మకం కల్పించి అప్పగించిన పనిని సక్రమంగా నిర్వర్తిస్తూనే మరింత బలంగా మారడానికి సొంత సిబ్బందికి పదవులు ఇప్పించుకోవడానికి హస్తినకు పయణమవుతున్నారు.

అన్నీ చకచకే..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ఓ వారం పదిరోజులు కాస్త మందకోడిగా సాగినా, ఆ తర్వాత అన్నింటిని చకచకా చేస్తూ దూసుకెళ్తూనే ఉంది. ప్రతిపక్ష పార్టీ విమర్శనాస్త్రాలతో సిద్ధంగా ఉన్నా ఎక్కడా అవకాశం ఇవ్వకుండా చేయాల్సినవి ఆపడం లేదు. పథకాల అమలు మొదలు, పాలన వ్యవహారాల వరకు రేవంత్ రెడ్డి తన మార్కు చూపుతూ సాగుతున్నారు. ఓ వైపు పెట్టుబడుల కోసం శ్రమిస్తూనే మరోవైపు స్వయంగా ఉపాధి అవకాశాలను క్రియేట్ చేయడానికి ప్రణాళిక రచనలు చేస్తున్నారు. ఈ తరుణంలోనే పాలనా వ్యవహారాలు మరింత సున్నితంగా, ప్రజలకు ఇంకా జవాబుదారీగా ఉండాల్సిన విషయాన్ని గుర్తెరిగి బాధ్యత పంపకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తను సహా 12 మంది మంత్రులున్న ప్రస్తుత సమయంలో ఇంకా ఆరు ఖాళీలను నింపేందుకు కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ విస్తరణతో పని వికేంద్రీకరణ జరిగిన ఒత్తిళ్లు లేకుండా సాఫీగా సాగుతుందనే ఆలోచన ఉన్నారు. కాగా ఖాళీలు పూరించడానికి అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నూతన పీసీసీ చీఫ్.., కొత్త మంత్రులు.., నామినేటెడ్ నేతలను అధికారికంగా ప్రకటించడానికి సీఎం సన్నాహాలు చేస్తున్నారు. ఏ పనిని ఆపకుండా చకచకా చేస్తూ తనదైన స్టైల్ లో దూసుకెళ్తున్నారు.

తన అనుచర వర్గానికి పెద్దపీట
మంత్రి వర్గ కూర్పులో సీఎం రేవంత్ తన అనుచర వర్గానికి పెద్దపీట వేయబోతున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్ రాజకీయాలు, అవసరాలు, తననే నమ్ముకున్నవారి బాగోగుల దృష్ట్యా సొంత టీం ను దింపడానికి పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కేబినెట్ విస్తరణలో లక్ చిక్కించుకోబోతున్న వారెవరెవరు అనేది బయటకు రహస్యమేగానీ, ఆ విషయమై సీఎంకు స్పష్టత ఎప్పుడో ఉందని దగ్గరి వారు పేర్కొంటున్నారు. పార్టీలోని యోధనయోధులను ఎదురించి నిలిచిన వ్యక్తిగా సీఎంకు పేరున్న విషయం తెలిసిందే. సీనియర్ల నుంచి మొదట తప్పించుకుని, తర్వాత ఒప్పించి ఎలాగోలా సీఎం సీటైతే దక్కించుకున్నాడు. తదనంతరం దీర్ఘదృష్టితో అందరినీ కలుపుకుపోవాలనే ఎనిమిది నెలలుగా ఓర్పుగా సాగాడు. పడ్డోడెప్పుడు చెడ్డోడు కాదన్నట్టుగా ఎలాగైతేనే పాలన గాడిన పడింది. ప్రజానీకానికి ప్రభుత్వంపై ఓ క్లారిటీ వచ్చింది. ఇక ఇఫ్పుడు రేవంత్ పూర్తిగా తన మార్కు కోసం రంగంలోకి దిగబోతున్నట్టు వినికిడి. మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు, ఇతరాత్ర హోదాల్లో పూర్తిగా తనవారిని కూర్చి చూపాలనే ఆలోచనలో ఉన్నారు. కొందరు సీనియర్లకు చెక్ పెట్టి, వచ్చిన అవకాశాన్ని తనకోసమే ఉపయోగించుకునేలా ఢిల్లీ పెద్దలతో మాట్లాడడానికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికల నేపథ్యంలో..
నిజానికి కేబినెట్ లో ఆరుగురికి అవకాశం ఉన్నా నలుగురిని మాత్రమే ప్రస్తుతానికి ఎంపిక చేసినట్లు సమాచారం. గ్రేటర్ ఎన్నికలను పరిగణలోకి తీసుకొని పదవుల రేసులో నల్లగొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలూనాయక్‌, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి, ఆదిలాబాద్‌ నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వివేక్‌, గడ్డం వినోద్‌ పోటీ పడే అవకాశం ఉంటుందని తెలిసిన విషయమే. ఈ తరుణంలోనే తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎస్టీని నియమిస్తే బాలూనాయక్‌ను డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశం ఉండనుంది. బీసీ, ఎస్సీ వర్గాల నుంచి టీపీసీసీ చీఫ్‌ను ఎంపిక చేస్తే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు బాలూనాయక్‌ కూడా మంత్రి పదవి దక్కే వెసులుబాటు ఉండనుంది.

బీసీ కమిషన్‌ చైర్మన్‌ పోస్టును మున్నూరుకాపు సామాజిక వర్గానికి కేటాయించే ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో కమిషన్‌ చైర్మన్ పదవికి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ నాయకులు వి.హన్మంతరావు, గోపిశెట్టి నిరంజన్‌ లో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని అంటున్నారు. రైతు, విద్యా కమిషన్‌ చైర్మన్లుగా కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళి పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం. అధిష్టానం దీనిపై మరో రెండు రోజులలో క్లారిటీ ఇవ్వనుందని చెబుతున్నా, అఫీషియల్‌గా ప్రకటించడమే తరువాయి.

17 లేదా 18 ఢిల్లీకి సీఎం..?
ముఖ్యమంత్రి ఈ నెల 17 లేదా 18వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. అధినేత్రి సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ఇతర ప్రముఖులను కలువనున్నారు. మంత్రి విస్తరణ, రాష్ట్రానికి విదేశాల నుంచి వస్తున్న పెట్టుబడులు, బృందంతో పర్యటించిన విశేషాలు, రాష్ట్ర రాజకీయాల్లోని పలు అంశాలపై చర్చలు జరుపనున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చి పార్టీ కండువా కప్పుకున్న వారికి సరైన ప్రాధాన్యం విషయాలపై కూడా పెద్దలతో మాట్లాడుతారు. కారు పార్టీ నుంచి ఇంకా వలసలు వచ్చే అవకాశాలు, బీజేపీని ఎదుర్కునేందుకు తీసుకోవాల్సిన వ్యూహాలు.., వంటివి కూడా పార్టీ పెద్దలతో చర్చించే అవకాశాలున్నాయి. మరీ ముఖ్యంగా మంత్రి వర్గ విస్తరణ విషయమై సాధ్యాసాధ్యాలు, లెక్కలు, సమీకరణాలపై విస్తృతంగా ముచ్చటించే ఛాన్సు ఉంది. కాగా, నుంచి మంత్రి వర్గంలోని మార్పులు కూర్పుల జాబితాను రహస్యంగా ఉంచి ఈ నెల 20వ తేదీన విస్తరణ చేపట్టనున్నారు. ఆ రోజుతో కొత్త మంత్రులు రేవంత్ కేబినెట్ లో కొలువుతీరనున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు