జనపదం – గురువారం -15-08-2024 E-Paper
ఎరైటి… ఏలేటి…?!
ఎజెండా సొంతం.. తీరు ఏకైకం..
వేలెట్టి కెలుకుతున్న మహేశ్వర రెడ్డి..
సుంకిశాల పనుల డొల్లాపై తీవ్ర ఆరోపణలు..
మేఘాపై చిందులు..
చర్యలు తీసుకోవాలని సర్కార్ పై ఒత్తిడి..
మౌనంగా మిగతా కాషాయం నేతలు..
హైకమాండ్ తో గిల్లి కోసమేనా..?
కిషన్నను పంపడానికా…? పంపిస్తే వెళ్లడానికా…?
ఏలేటి మహేశ్వర రెడ్డి వ్యవహారం చూస్తుంటే వేలెట్టి కెలికినట్టే అనిపిస్తోంది. ‘సుంకిశాల’ ఎపిసోడ్ తో సొంత గూటిలోనే కుంపటి రాజుకునేలా చేస్తున్నాడు. ప్రాజెక్ట్ రీటైనింగ్ వాల్ కూలిన నుంచి ఆయన మేఘా (మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) పై దుమ్మెత్తిపోస్తున్న తీరు ఏదో చేయాలనే ఉద్దేశంతోనే అనేది తెలిసిపోతోంది. మేఘా యాజమాన్యం అంత ఆశామాషీది కాదని తెలిసినా, పార్టీకి ఎలక్ర్టోరల్ బాండ్ల రూపంలో ఎంతో సాయం చేసిందనే వాస్తవం ఎరిగినా ఆయన మసులుకుంటున్న తీరు మరేదో అయ్యే ఉంటుందని గమనిస్తే ఇట్టే అర్థమవుతుంది. పార్టీ ఎంపీలు, తనతోటి ఎమ్మెల్యేలంతా సైలెంట్ గా ఉంటే ఆయనొక్కరు మాత్రం సుంకిశాలపై ప్రత్యేకంగా సాగుతున్న తీరు పార్టీ అంతర్గతంపై అనుమానాలను రేకెత్తిస్తోంది. పొగపెట్టడానికనేది స్పష్టంగా తెలుస్తున్నా.., తనను తానుగానా.., ఇతరులెవరికైనానా..? అనేది తేలాల్సి ఉందిమరి….
============================
జనపదం, బ్యూరో
ఏలేటి మహేశ్వర రెడ్డి.. ఇప్పుడో సంచలనం. బీజేపీకి సభా వ్యవహారాలను చూస్తున్న ఆయన రాష్ట్ర సర్కార్ పై సంధిస్తున్న ప్రశ్నలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా సుంకిశాల ఇష్యూలో మేఘా పై చేస్తున్న ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. తనకు తాను ఏకైకం అన్నట్టుగా వ్యవహరిస్తూ అటు అధికార పార్టీని ఇరుకున పెట్టడమే కాకుండా ఇటు స్వపక్షంలోని సీనియర్లనూ డైలమాలో పడేస్తున్నారు. సొంత ఎజెండాతో తనకు తానుగా సాగుతూ నా దారి రహదారి అనే రీతిగా ఎవరికీ మింగుడుపడని తీరుగా మసులుతున్నారు.
సుంకిశాల పనుల డొల్లాపై తీవ్ర ఆరోపణలు..
సుంకిశాల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రీటైనింగ్ వాల్ కూలిపోగా దానిపై ఎమ్మెల్యే ఏలేటి రోజూ నిర్మాణ సంస్ధపై ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని, సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేయటమే కాకుండా నిర్మాణాల తీరుపై సుప్రీంలో కేసు వేస్తానని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం కంపెనీ మీద యాక్షన్ తీసుకోకపోతే కోర్టులో కేసు వేస్తానని బెదిరిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. కంపెనీకి వ్యతిరేకంగా మీడియా సమావేశాలు నిర్వహించటమే కాక మంగళవారం ప్రాజెక్టును కూడా సందర్శించి ఇంకా ఉత్కంఠ రేపుతున్నారు.
హైకమాండ్ తో గిల్లి కోసమేనా..?
మేఘా కంపెనీకి వ్యతిరేకంగా ఏలేటి ఎంత మాట్లాడినా, ఆరోపణలు చేసినా ఉపయోగం ఉండదనేది తెలిసిందే. ఎందుకంటే కంపెనీ యాజమాన్యానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల్లో గట్టి పట్టుంది. పార్టీ పెద్దలతో సత్సంబంధాలున్నాయి. బీజేపీకి వచ్చిన రూ.6500 కోట్ల ఎలక్టోరల్ బాండ్లలో మేఘా యాజమాన్యం ఇచ్చిందే రూ.540 కోట్లంటే ఎంత స్ట్రాంగో చూడొచ్చు. కేంద్రంతో పాటు పార్టీ పెద్దలతో ఇంతటి గట్టి ఆర్థిక సంబంధాలున్న కంపెనీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఏం మాట్లాడితే మాత్రం ప్రయోజనం ఏముందని పలువురంటున్నారు.
తెలంగాణా బీజేపీ మొత్తంమీద మేఘా కంపెనీకి వ్యతిరేకంగా రోజూ మాట్లాడుతున్నది ఒక్క ఏలేటి మాత్రమే. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు మిగిలిన ఆరుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఎవరూ నోరు విప్పడం లేదు. రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తో పాటు పార్టీలోని సీనియర్ నేతల్లో ఎవరూ కంపెనీ గురించి చర్చ తీయడం లేదు. అలాంటిది ఏలేటి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధంకావటంలేదు. మేఘా యాజమాన్యంతో ఉన్న సంబంధాల కారణంగా ఎవరూ కంపెనీకి వ్యతిరేకంగా నోరు తెరవొద్దని పెద్దల నుంచి ఆదేశాలు ఉన్నా ఏలేటి తెగింపే ఇప్పుడు హాట్ టాపిక్.
కిషన్ రెడ్డిని పంపడానికా…? తనను పంపిస్తే పోవడానికా..?
ఎమ్మెల్యే ఏలేటి బీజేఎల్పీ నేత. పార్టీ లైనును దాటి వెళుతున్న కారణంగా పార్టీని ఇరకాటంలో పడేయాలని అనుకుంటున్నట్లుగా ఆరోపణలు మొదలయ్యాయి. మేఘా కంపెనీకి తెలంగాణాలో మాత్రమే కాదు బీజేపీ పాలిత రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి చాలా రాష్ట్రాల్లో కాంట్రాక్టులున్నాయి. వీటిల్లో అత్యధికం కేంద్రప్రభుత్వ శాఖల్లోని పనులే. ఈమధ్యే రక్షణ రంగానికి చెందిన తుపాకుల తయారీ కాంట్రాక్టు కూడా మేఘాకు వచ్చింది. దీంతోనే కంపెనీ యాజమాన్యానికి కేంద్రప్రభుత్వంతో పాటు పార్టీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం అర్ధమవుతోంది. ఇంత పెద్ద వ్యవహారంలో ఏలేటి దూకుడు వెనక కారణాలు అన్వేషిస్తే కొన్ని పరిణామాలు చూడొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పార్టీ నుంచి కిషన్ రెడ్డిని సాగనంపడమో., లేదంటే అంతా కలిసి తనను పంపించేలా ప్రేరేపించడమో లక్ష్యంగా ఇదంతా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే యూటాక్స్, బీ టాక్స్, అది, ఇది అంటూ ఎట్సెట్రా ఎట్సెట్రా వాదనలు వినిపిస్తున్న ఎమ్మెల్యే ఇప్పుడు ఇంకాస్త రెచ్చిపోతూ ఆయన చుట్టూ ఉచ్చు బిగించడానికే చేస్తున్నాడని పలువురు పేర్కొంటున్నారు. మహేశ్వర రెడ్డి పార్టీలో చిందులేస్తున్న తీరు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నా, మర్మం మాత్రం అర్థం కాకుండా ఉందనే వారూ ఉన్నారు. ఏదిఏమైనా పంచాయితీ పెట్టుకోవాలని బయటకు వెళ్లగొట్టడమో.., తానైనా వెళ్లిపోవడమే చేయాలనే ఆలోచన మాత్రం సుస్పష్టం. అందుకే పార్టీలో ఏ నాయకుడు చూపని ఉత్సాహం ఆయనొక్కరే చూపుతున్నాడని పలువురు సొంతపార్టీ నేతలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
యాజమాన్యం తిరగబడితే..?
సుంకిశాల విషయమై మేఘా కంపెనీ యాజమాన్యం కూడా గట్టిగా ఏలేటిని ఒక చూపుచూస్తే ఇబ్బంది కర పరిస్థితులే ఎదురుకాబోతాయి. ఇప్పటికే ఏలేటి మీద పార్టీలో చాలామంది మండిపడుతున్నారు. ఇంతమంది వ్యతిరేకిస్తున్న కారణంగా ఆయనపై పార్టీ పెద్దలు చర్యలు తీసుకోవటం పెద్ద పనేమి కాదు. కానీ ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలు, విమర్శలతో పార్టీని కూడా వివాదంలోకి లాగేయటం ఖాయమనే ప్రచారం వినిపిస్తోంది. చివరకు కంపెనీ-ఏలేటి వ్యవహారం ఎలా ముగుస్తుందో వెయిట్ అండ్ సీ…….